మాస్కో: తమ మిలిటరీ కోసం భారతీయ పౌరుల(Indian Citizens)ను రిక్రూట్ చేసుకోవడం లేదని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జఖరోవా తెలిపారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధ క్షేత్రంలో భారతీయులు ఉన్న వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో వేసిన ఓ ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ఆ వీడియోల గురించి తన వద్ద ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. భారతీయ రిక్రూట్మెంట్ విషయంలో రష్యా అధికారుల పాత్ర ఏమీ లేదని ఆమె అన్నారు. ఒకవేళ ఎవరైనా ఏదైనా సమాచారాన్ని అందిస్తే, దాని గురించి విచారణచేపట్టనున్నట్లు జఖరోవా తెలిపారు. విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాంటూ హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న నలుగుర్ని గత వారం సీబీఐ అరెస్టు చేశారు.
సోషల్ మీడియా ఆధారంగా యువతను ఆకర్షిస్తున్నారని, రష్యాలో ఉద్యోగం కల్పించనున్నట్లు చెబుతూ మోసం చేస్తున్నారని తెలిసింది. ఇండియాలో రిక్రూట్ చేసి, ఆ తర్వాత ఆ యువతకు శిక్షణ ఇచ్చి, వాళ్లను యుద్ధ క్షేత్రంలోకి పంపిస్తున్నారని సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది. రష్యా మిలిటరీలో జరుగుతున్న భారతీయ పౌరుల రిక్రూట్మెంట్ కేసులో ప్రధాన నిందితుడిని నిజిల్ జోబీ బెన్సమ్గా గుర్తించారు. దుబాయ్‌లో ఉన్న ఓ వ్యక్తి వీసాలను ప్రాసెస్ చేశాడు. బాధితులు రష్యాకు వెళ్లేందుకు ట్రావెల్ ఏర్పాట్లు చేసేవాడు.
మార్చి నెలలో సీబీఐ 13 ప్రాంతాల్లో సోదాలు చేసి పలువుర్ని అరెస్టు చేసింది. ఢిల్లీ, ముంబై, తిరువనంతపురం, ముంబై, అంబాలా, మధురై నగరాల్లో సోదాలు జరిగాయి. రష్యాకు యువకుల్ని రిక్రూట్ చేసిన ఘటనలో 17 వీసా కన్సల్టెన్సీ కంపెనీలు ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు రష్యాకు వెళ్లిన వారిలో పది మంది మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చారు.