న్యూయార్క్: ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాను శిక్షించాల్సిందే అంటూ జెలెన్స్కీ తెలిపారు. న్యూయార్క్‌లోని యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రీ రికార్డింగ్ వీడియోను జనరల్ అసెంబ్లీలో ప్లే చేశారు. ప్రత్యేక యుద్ధ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని, యుద్ధ నేరాలకు పాల్పడిన రష్యాపై విచారణ చేపట్టాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డిమాండ్ చేశారు. తమకు మరింత సైనిక సహాయాన్ని అందించాలని, ప్రపంచం ముందు రష్యాకు శిక్ష వేయాలని కోరారు. జెలెన్స్కీ ప్రసంగం ప్లే అవుతున్న సమయంలో.. జనరల్ అసెంబ్లీలో ఉన్న చాలా మంది సభ్యులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. అనైతిక పద్ధతిలో యుద్ధానికి దిగిన రష్యా.. వినాశకర పరిస్థితుల్ని సృష్టిస్తోందని అన్నారు. మరో వైపు ౩ లక్షల మంది రిజర్వ్ సైనికుల్ని రంగంలోకి దింపేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు పుతిన్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పుతిన్ చేసిన ప్రకటన చూస్తే వాళ్లు శాంతి చర్చల పట్ల కట్టుబడి లేరని తెలుస్తోందని జెలెన్స్కీ అన్నారు.