సిడ్నీ: పాడైన టైర్లు, రీసైకిల్డ్ ప్లాస్టిక్స్‌తో మన్నిక గల రోడ్లను నిర్మించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలోని చార్లెస్ డార్విన్ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం ఈ పరిశోధనను నిర్వహిస్తున్నది. వాహనాలలో వాడి, పారేసే టైర్ల ముక్కలను ఆస్ఫాల్ట్, బిటుమెన్లతో కలిపి, వాటిలో రీసైకిల్డ్ ప్లాస్టిక్స్‌ను వేసి, నిర్మించిన రోడ్లను పరీక్షిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని ఉత్తర ప్రాంతంలో ఉండే ప్రత్యేకమైన వాతావరణానికి తగినట్లుగా ఈ రోడ్లను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధిక వేడి, అతి నీల లోహిత కిరణాలు పడటం, ఇతర పర్యావరణపరమైన ఒత్తిళ్లలో ఈ మెటీరియల్స్ ఎలా పని చేస్తాయో తెలుసుకునేందుకు కృషి చేస్తున్నారు.
సీడీయూ పీహెచ్డీ క్యాండిడేట్ రమిన్ షహబాజీ మాట్లాడుతూ, ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటుందని, అందువల్ల దీర్ఘ కాలంలో సమయం గడుస్తున్నకొద్దీ రోడ్లలో వేర్వేరు రసాయనిక ప్రతిచర్యలు కనిపిస్తాయని చెప్పారు. రోడ్లు కఠినంగా లేదా మరింత పెళుసుగా మారుతాయన్నారు. ఫలితంగా రోడ్లు దెబ్బతింటాయని తెలిపారు. సంప్రదాయ పేవ్మెంట్ మెటీరియల్స్ పనితీరుతో పోల్చగలిగే లేదా అధిగమించే పనితీరును రీసైకిల్డ్ రబ్బర్, ప్లాస్టిక్స్‌తో సాధించాలనేది తమ లక్ష్యమని చెప్పారు. ఈ మెటీరియల్స్ వల్ల నిర్మాణ వ్యయం తగ్గవచ్చునని తెలిపారు. నమ్మదగిన ఫలితాలను సాధించాలంటే మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపారు.