హనోయి, సెప్టెంబర్ 14: నాలుగు దశాబ్దాలకు పైగా వియత్నాం అడవుల్లో జీవించిన హో వాన్ లాంగ్… కాలేయ క్యాన్సర్ బారినపడి మరణించాడు. అతని వయసు 52 సంవత్సరాలు. కీకారణ్యంలో టార్జాన్లా బతికిన అతను బయటి ప్రపంచంలోకి వచ్చి 8 ఏండ్లు అవుతున్నది. 1972లో వియత్నాం యుద్ధ సమయంలో తండ్రితో కలిసి లాంగ్ అడవుల్లోకి పారిపోయాడు. నాడు అమెరికా బాంబు దాడిలో లాంగ్ ఇల్లు ధ్వంసమైంది. అతని తల్లి, ఇద్దరు తోబట్టువులు ప్రాణాలు కోల్పోయారు. అడవుల్లో లాంగ్, అతని తండ్రి జాడ తెలిసిన తర్వాత 2013లో వారిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికి ఇంకా యుద్ధం జరుగుతున్నదనే భ్రమలోనే వారున్నారు. లాంగ్ తండ్రి 2017లో మరణించాడు. లాంగ్ ఆధునిక జీవన శైలికి అలవాటుపడ్డారు. మానసిక ఒత్తిడితో పాటు మద్యం, ప్రాసెస్డ్ ఆహారం లాంగ్ ఆరోగ్యానికి చేటు చేశాయని అతని స్నేహితుడొకరు తెలిపారు.