మాస్కో: ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాల్లో నవంబర్ 4న రిఫరెండం నిర్వహించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పార్టీ ప్రతిపాదించింది. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా దళాలు ఆక్రమించిన నగరాలను రష్యాలో కలుపుకునేందుకు అధికార యునైటెడ్ రష్యా పార్టీ బుధవారం కీలక ప్రతిపాదన చేసింది. ‘రష్యా జాతీయ ఐక్యత దినోత్సవమైన నవంబర్ 4న రిఫరెండం నిర్వహించడం సరైందని పార్టీ సెక్రటరీ జనరల్ ఆండ్రీ తుర్చక్ తన వెబ్సైట్లో తెలిపారు. ఓటింగ్ తర్వాత డొనెట్స్క్, లుహాన్స్క్, అనేక ఇతర రష్యన్ నగరాలు చివరకు తమ సొంత భూమికి తిరిగి వస్తాయని చెప్పారు. తద్వారా అధికార సరిహద్దులతో వేరైన రష్యన్ ప్రపంచం తన సమగ్రతను తిరిగి పొందుతుందని పేర్కొన్నారు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగింది. మూడు నెలలకుపైగా కొనసాగిన భీకర యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యం ధీటుగా పోరాడింది. పశ్చిమ దేశాలు అందజేసిన ఆయుధాలతో రష్యా ఆర్మీ, నేవీ, వైమానిక దళాలకు తీవ్ర నష్టం కలిగించింది.
మరోవైపు ప్రపంచ దేశాల నుంచి రష్యాపై తీవ్ర ఒత్తడి, ఆంక్షలు పెరిగాయి. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ స్వాధీన వ్యూహాన్ని విరమించుకున్న రష్యా తన సైన్యాన్ని వెనక్కి మళ్లించింది. అయితే ఉక్రెయిన్ సరిహద్దులోని కీలక నగరాలను రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. తాజాగా ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాలను రష్యా ప్రధాన భూభాగంలో కలుపుకునేందుకు నవంబర్ 4న రిఫరెండం నిర్వహించాలని రష్యా భావిస్తున్నది.