మాస్కో: ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కీవ్‌లో నాయకత్వాన్ని తొలగించి అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి’ అని ఉక్రెయిన్ ఆర్మీకి పిలుపునిచ్చారు. ఆ దేశ పాలకులను ఉగ్రవాదులుగా, నియో-నాజీలుగా, డ్రగ్స్‌కు బానిసలుగా ఆయన అభివర్ణించారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం శుక్రవారానికి రెండో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో పుతిన్ టీవీలో ప్రసంగించారు. ఉక్రెయిన్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆ దేశ ఆర్మీకి పిలుపునిచ్చారు.
‘మాదకద్రవ్యాల బానిసలు, నియో-నాజీల ముఠాతో కంటే మీతో (ఉక్రెయిన్ ఆర్మీ)తో మేము ఏకీభవించడం చాలా సులభం అనిపిస్తుంది’ అని అన్నారు.
యూదు (జువిష్) అయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రభుత్వంపై పుతిన్ మండిపడ్డారు. సొంత పౌరులపై దాడుల కోసమే కొందరికి తుపాకులు, ఆయుధాలను ఇచ్చారని విమర్శించారు. ఆ నింద తమపై వేసేందుకు ఉక్రెయిన్ పాలకులు కుట్రపన్నారని ఆరోపించారు. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనని, దీని కోసం ప్రతినిధులను కూడా పంపుతామని పుతిన్ అన్నారు. కీవ్‌లోకి దూసుకెళ్తున్న రష్యా సైనిక దళాలను ఉక్రెయిన్ ఆర్మీ తీవ్రంగా ప్రతిఘటిస్తున్న తరుణంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.