ఆటనే కదా అని తల్లిదండ్రులు అనుకున్నారు.. ఆ ఆటే పాకిస్తాన్లో ఇప్పుడు కొంపలు ముంచుతోందట. పాక్‌లోని పిల్లలు బొమ్మ గన్లతో తెగ ఆడుకుంటున్నారు. దీంతో వారి మానసిక స్థాయిలో అనేక మార్పులు వస్తున్నాయని, ఈ బొమ్మల వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు వస్తున్నాయని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని, వెంటనే గన్ బొమ్మలను నిషేధించాలని ఆల్ పాకిస్తాన్ ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ బొమ్మల వల్ల పిల్లలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ బొమ్మలను నిషేధించాలని,ఆ బొమ్మలను అమ్మే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కృత్రిమ ఆయుధాలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తోంది.
ఈ బొమ్మల ద్వారా పిల్లల్లో నేర కార్యకలాపాలపై విపరీతమైన మోజు పెరిగిపోతోందని, అటు వైపు వాళ్లు ఆకర్షితులు అవుతున్నారని ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ పేర్కొంటోంది. అలాగే మానసికంగా కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నారని ఆ సంస్థ తెలిపింది.
అయితే కృత్రిమ ఆయుధాలు, బొమ్మ గన్నులపై గతంలోనూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో 2017 లో ప్రభుత్వం విక్రయశాలలపై చర్యలు తీసుకుంది. అనేక బొమ్మలను జప్తు కూడా చేసింది. అనేక మంది వ్యాపారస్తులను అరెస్ట్ కూడా చేసింది. మళ్లీ ఇప్పుడు.. ఈ వివాదం తెరపైకి వచ్చింది.