బ్రసెల్స్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University)లో చుదువుతున్న విదేశీ విద్యార్థులపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసుకుని ప్రస్తుతం సమ్మర్ సెలవుల్లో ఉన్న ఆ వర్సిటీ విదేశీ విద్యార్థులకు ఇప్పుడు టెన్షన్ పట్టుకున్నది. విదేశీ విద్యార్థులకు హార్వర్డ్‌లో ఎంట్రీపై నిషేధం విధిస్తూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు బెల్జియం యువరాణి ఎలిసబెత్‌కు కూడా కష్టాలు తెచ్చిపెట్టాయి. రెండో సారి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత హార్వర్డ్ వర్సిటీలో జరుగుతున్న ఆందోళనలపై ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. విద్యార్థుల్ని అదుపులో పెట్టలేకపోతున్న వర్సిటీకి ఫెడరల్ ఫండ్‌లో కోతలు కూడా విధించారు. ట్రంప్ సర్కారుకు, హార్వర్డ్ వర్సిటీకి రిలేషన్ సరిగా లేకుండాపోయింది. తాజాగా విదేశీ విద్యార్థుల నమోదు అంశంలో ట్రంప్ ఇచ్చిన కొత్త ఆదేశాలు మరింత సమస్యాత్మకంగా మారాయి.
ఆ వర్సిటీలో చదువుతున్న విదేశీయుల్లో.. భారతీయులు, చైనీయలు, ఇతర సంపన్నుల పిల్లలు కూడా ఉన్నారు. వర్సిటీ డేటా ప్రకారం సుమారు 6800 మంది విదేశీ స్టూడెంట్స్ చదువుతున్నట్లు హార్వర్డ్ పేర్కొన్నది. దీంట్లో అయిదో వంత విద్యార్థులు చైనీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రతిష్టాత్మక వర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న వారిలో బెల్జియం యువరాణి కూడా ఉన్నారు. 23 ఏళ్ల ప్రిన్సెస్ ఎలిసబెత్ ఇప్పుడు ఆ వర్సిటీలో ఫస్ట్ ఇయర్ పూర్తి చేసింది. ఇతర కాలేజీలకు తమ స్టేటస్‌ను మార్చుకోవాలని ట్రంప్ సర్కారు హార్వర్డ్ విద్యార్థులపై వత్తిడి తెస్తున్న నేపథ్యంలో యువరాణి భవిష్యత్తు కూడా గందరగోళంగా మారింది. అయితే అమెరికా ప్రభుత్వ నిర్ణయంపై త్వరలో తమ వివరణ ప్రకటించనున్నట్లు బెల్జియం రాయల్ ప్యాలెస్ ప్రతినిధి లోర్ వాండోర్నీ తెలిపారు.
ప్రిన్సెస్ ఎలిసబెత్.. హార్వర్డ్ వర్సిటీలో పబ్లిక్ పాలసీ చదుతువున్నారు. అది రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ కోర్సు. పబ్లిక్ సర్వీస్‌లో విజయవంతమైన కేరీర్‌ను కొనసాగించేందుకు ఆ సబ్జెక్టును నేర్పుతారు. ఆ కోర్సు వల్ల విద్యార్థుల ఆలోచన సరళిని, నైపుణ్యాన్ని పెంచనున్నారు. బెల్జియం చక్రవర్తి ఫిలిప్, రాణి మాథిల్డే పెద్ద కుమార్తె ప్రిన్సెస్ ఎలిసబెత్. అయితే హార్వర్డ్‌లో చేరడానికి ముందు ఆమె బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీలో హిస్టరీ, పాలిటిక్స్‌లో డిగ్రీ చదివారు.
విదేశీ విద్యార్థుల ఎన్రోల్మెంట్పై ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని హార్వర్డ్ వర్సిటీ వ్యతిరేకిస్తున్నది. ఆ అక్రమ నిర్ణయం వల్ల వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడినట్లు వర్సిటీ పేర్కొన్నది.