వాటికన్ సిటీ: క్యాథలిక్ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వయసు మీద పడడం వల్ల ఎక్కువగా ట్రావెలింగ్ చేయలేకపోతున్నానని, మోకాలి నొప్పులు ఇబ్బందిపెడుతున్నాయని, కాస్త తగ్గాలన్న సంకేతాన్ని అందిస్తున్నాయని, ఏదో ఓ రోజు రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. 85 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ శనివారం రిపోర్టర్లతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. రాజీనామా చేయాలన్న ఆలోచనలో లేనని, కానీ దానికి దారులు తెరిచే ఉన్నాయన్నారు. పోప్ తన పదవి నుంచి తప్పుకోవడంలో ఎటువంటి తప్పులేదని ఫ్రాన్సిస్ అన్నారు. పోప్ రిటైర్ కావడం ఆశ్చర్యం ఏమీలేదని, అదేమీ నష్టమేమీ కాదు అని, పోప్‌ను మార్చే వీలు ఉందని ఫ్రాన్సిస్ తెలిపారు. రిటైర్మెంట్ ఆలోచన లేకున్నా.. తన పనుల్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోప్ ఫ్రాన్సిస్ వీల్‌చైర్ వాడడం వల్ల ఆయన పనితీరుపై ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.