టెహ్రాన్, జూన్ 12: పశ్చిమాసియాలో ఘర్షణలను నిలిపివేయడానికి అమెరికా, ఇరాన్ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై ఆదివారం నాటికి జెనీవాలో సంతకాలు జరిగే అవకాశం ఉందని పాశ్చాత్య వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది. ఆంక్షల సడలింపు, ప్రాంతీయ కాల్పుల విరమణ నిబంధనలు, ఘర్షణానంతర ఏర్పాట్లపై చర్చలు తుదిరూపు దిద్దుకుంటున్నట్లు వార్తాసంస్థ తెలిపింది. హెజ్బొల్లాకు వ్యతిరేకంగా లెబనాన్‌లో సైనిక చర్యలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ను కూడా ఈ ఒప్పందం పరిధిలోకి తీసుకోవాలని ఇరాన్ పట్టుపడుతున్నది. అయితే శనివారం నాటికి ముసాయిదా సిద్ధం చేస్తే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఖర్ ఆదివానం జెనీవాలో తుది ఒప్పందంపై సంతకాలు చేయడానికి మార్గం సుగమం అవుతుంది.
అయితే జెనీవాలోని వేదిక ఇంకా ఖరారు కాలేదు. కొత్తగా రూపొందుతున్న ఈ ఒప్పందంలో ఆంక్షల సడలింపు, ఇరాన్ ఆస్తులపై స్తంభనను తొలగించడం వంటి రాయితీలు ఉన్నాయని ఇరాన్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి రాయిటర్స్‌కు తెలిపారు. ఇరాన్ ఈ ఒప్పందాన్ని లెబనాన్తోసహా విస్తృత ప్రాంతీయ కాల్పుల విరమణకు ముడిపెట్టగా అణు చర్చలను తర్వాతి దశకు వదిలివేసింది. అయితే ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకూడదనే వైఖరిని అమెరికా కొనసాగిస్తుండగా తమ అణు కార్యక్రమం శాంతియుతమైనదని ఇరాన్ స్పష్టం చేస్తున్నది. ఆంక్షల సడలింపునకు మించి అమెరికా హామీలు కూడా ఈ ముసాయిదాలో ఉన్నాయని ఇరాన్ వార్తాసంస్థ మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
అమెరికా, దాని మిత్రదేశాలు ఇరాన్ పునర్నిర్మాణం కోసం కనీసం 30,000 కోట్ల డాలర్ల విలువైన ప్రణాళికలను సమర్పించాలని, ఇది ప్రతిపాదిత పరిష్కారానికి సంబంధించిన అత్యంత విస్తృతమైన ఆర్థిక డిమాండ్లలో ఒకటని వార్తాసంస్థ తెలిపింది. డీల్‌కు సంబంధించిన వార్తలు కేవలం ఊహాగానాలేనని, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ తెలిపారు. పరిష్కారం కాని కీలక అంశాలపై ఇరాన్ వైఖరిని అధికారిక వార్తాసంస్థ ఇర్నా వివరించింది. ఒప్పందంపై సంతకాలు పూర్తయిన తర్వాత 60 రోజుల్లోగా అణు చర్చలు జరుగుతాయని ఇర్నా పేర్కొన్నది.
ప్రస్తుత అవగాహన ఒప్పందంలో అణు అంశం ప్రస్తావన ఉండదని స్పష్టం చేసింది. వ్యూహాత్మక జలమార్గాల విషయంలో పాలన ఏర్పాట్లు ప్రాంతీయ స్థాయిలోనే ఉంటాయని ఇర్నా తెలిపింది. ఈ జలసంధికి సంబంధించిన భవిష్యత్తు పాలన వ్యవహారం, ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు, ఉమ్మడి నిర్ణయాల ద్వారా ఒక ప్రాంతీయ అంశంగా పరిష్కారానికి నోచుకుంటుందని ఏజెన్సీ పేర్కొన్నది. అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం హొర్ముజ్ జలసంధి నిర్వహణ బదిలీకి సంబంధించి ఇరాన్ ఎలాంటి హామీ ఇవ్వదని వార్తాసంస్థ తెలిపింది. అయితే లెబనాన్ సంబంధిత కార్యకలాపాలపై ప్రతిపాదిత ఆంక్షలు ఇజ్రాయెల్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొనే అవకాశముంది.
ఇరాన్‌తో కుదుర్చుకోనున్న శాంతి ఒప్పందంలోని నిబంధనలపై ఆ దేశ అధికార వార్తాసంస్థ ప్రచురించిన కథనంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చర్చించిన అంశాలు అవి కావంటూ ఆయన మీడియా కథనాలను ఖండించారు. యుద్ధాన్ని ఆపడానికి ఇరు దేశాల మధ్య అంగీకరించిన నిబంధనలు ఇవి కావని ఆయన అన్నారు.