ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జైలు నుంచే ఆయన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. జైలుశిక్ష అనుభవిస్తున్న మరికొంత మంది రాజకీయ నాయకులు కూడా ఇవాళ జరుగుతున్న పోలింగ్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ మాత్రం ఓటు హక్కును వాడుకోలేదు. ఎందుకంటే పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆమెను అరెస్టు చేయడం వల్ల ఓటు వేయలేని పరిస్థితి వచ్చింది.
మెయిల్ ద్వారా ఓటేసిన నేతల్లో మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి, మాజీ పంజాబ్ సీఎం చౌదరీ పర్వేజ్ ఇలాహి, అవామీ ముస్లిం లీగ్ చీఫ్ షేక్ రషీద్, మాజీ సమాచారశాఖ మంత్రి ఫహద్ చౌదరీ ఉన్నారు. అడియాలా జైలులో ఉన్న ఖైదీల్లో వంద మంది ఓటు వేశారు. ఆ జైలులో సుమారు ఏడు వేల మంది ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది. కంప్యూటర్ ఐడెంటిటీ కార్డులు ఉన్న ఖైదీలకు మాత్రమే ఓటు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు.