Imran Khan | ఇస్లామాబాద్, ఫిబ్రవరి 3: మరో వారంలో పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరుగనుండగా ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. ఇప్పటికే పలు కేసుల్లో జైలు శిక్ష పడగా తాజాగా ఇస్లాం వివాహ చట్టం ఉల్లంఘన కేసులోనూ శిక్ష పడింది. ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ఏడేండ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.
ఇమ్రాన్, బుష్రా బీబీ ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం పెండ్లి చేసుకోలేదని పేర్కొంటూ ఆమె మొదటి భర్త ఖవార్ మనేకా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు పెండిండ్ల మధ్య ఖచ్చితంగా కొంత కాలం వ్యవధి ఉండాలన్న నియమాన్ని బుష్రా ఉల్లంఘించిందన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్, బుష్రా ఇద్దరూ వేర్వేరుగా రూ.5 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
ఈ నెల 8న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు చెప్పారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా పూర్తయ్యిందని వెల్లడించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.