ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని చర్సడ్డాలో 72 ఏండ్ల వయస్సులో అభంశుభం తెలియని మైనర్ బాలికతో పెండ్లికి (Child Marriage) సిద్ధమయ్యాడో వృద్ధుడు. తండ్రి ఒత్తిడితో వృద్ధుడిని వివాహం చేసుకోవడానికి ఆ 12 ఏండ్ల చిన్నారి ఒప్పుకున్నది. నిఖ్ఖాకు అంతా రడీ అయిన సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇకేముందు ఆ తండ్రి తప్పించుకోగా.. వృద్ధ పెండ్లి కొడుకు అడ్డంగా దొరికిపోయాడు. అతనితోపాటు పెండ్లి జరించడానికి వచ్చిన నిఖ్ఖా ఖ్వాన్ను కూడా అరెస్టుచేశారు.
డబ్బుకు ఆశపడిన బాలిక తండ్రి ఆలమ్ సయీద్.. రూ.5 లక్షలకు (పాక్ కరెన్సీ) ఆమెను వృద్ధుడికి అమ్మేశాడని పోలీసులు తెలిపారు. పెండ్లి కొడుకుని పట్టుకున్నామని, ఆలమ్ కోసం వెతుకుతున్నామని చెప్పారు. వారిద్దరితోపాటు నిఖ్ఖా ఖ్వాన్పై చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు నమోదుచేశామన్నారు.
కాగా, పాకిస్థాన్ బాల్య వివాహాలు తరుచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల రాజన్‌పూర్, తాట్టాలో ఇలాంటి ఘటనలే వెలుగుచూశాయి. పంజాబ్‌లోని రాజన్‌పూర్‌లో 40 ఏండ్ల వ్యక్తికి 11 ఏండ్ల బాలికతో వివాహం జరించారు. అదేవిధంగా థాట్టాలో 50 ఏండ్ల భూస్వామితో మైనర్ బాలిక వివాహం జరుగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. మే 6న స్వాత్‌లో 13 ఏండ్ల అమ్మాయిని పెండ్లి చేసుకుంటున్న 70 ఏండ్ల వృద్ధుడిని అరెస్ట్ చేశారు.