న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారి వ్యాఖ్యలు కలకలం రేపుతుండగా పాక్ మంత్రి షజియా మారి అణు యుద్ధానికి సిద్ధమని భారత్‌ను హెచ్చరించారు. పాకిస్తాన్‌కు ఎలా జవాబివ్వాలో తెలుసని, పాకిస్తాన్ వద్ద అణు బాంబు ఉందనే విషయం భారత్ విస్మరించరాదని అన్నారు.
అణ్వాయుధాలున్న తాము మౌనంగా కూర్చోబోమని, అవసరమైన సమయంలో తాము వెనుకడుగు వేయమని పీపీపీ నేత హెచ్చరించారు. తమను దెబ్బతీస్తే చేతులు ముడుచుకుని కూర్చోబోమని, పాకిస్తాన్ దీటుగా స్పందిస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌లో విద్వేషం విరజిమ్ముతున్నారని, మోదీ హయాంలో హిందుత్వను ప్రేరేపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంతో ముస్లింలకు బారత్ ముడిపెడుతోందని ఆరోపించారు.
కాగా అంతకుముందు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐరాస వేదికగా పాకిస్తాన్ ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ భుట్టో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒసామా బిన్ లాడెన్ మరణించాడని, కానీ గుజరాత్‌కు చెందిన కసాయి సజీవంగా ఉంటూ భారత ప్రధాని అయ్యారని తాను భారత్‌కు చెప్పదలుచుకున్నానని భుట్టో పేర్కొన్నారు. భారత ప్రధాన, విదేశాంగ మంత్రి ఆరెస్సెస్ మనుషులని, ఆరెస్సెస్ హిట్లర్ స్ఫూర్తితో పనిచేసే సంస్ధని వ్యాఖ్యానించారు.