లాహోర్: భార్యను లైంగికంగా వేధిస్తున్న పోలీస్‌ను ఆమె భర్త కిడ్నాప్ చేశాడు. తన అనుచరులతో కలిసి ఆ కానిస్టేబుల్‌ను హింసించాడు. అనంతరం అతడి ముక్కు, చెవులు, పెదాలను కత్తితో కోశాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. జాంగ్ జిల్లాకు చెందిన ఖాసిం హయత్ పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఒక మహిళను బెదిరించి లొంగదీసుకున్నాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియో చూపించి తనతో సంబంధం కొనసాగించాలని బ్లాక్మెయిల్ చేయసాగాడు.
కాగా, ఆ మహిళ భర్త ముహమ్మద్ ఇఫ్తికార్‌కు ఈ విషయం తెలిసింది. పోలీస్ కానిస్టేబుల్ ఖాసిం హయత్పై గత నెలలో ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే అంతటితో ఆగని ఇఫ్తికార్, 12 మంది అనుచరులతో కలిసి డ్యూటీ అనంతరం ఇంటికి తిరిగి వెళ్తున్న కానిస్టేబుల్ హయత్‌ను ఆదివారం కిడ్నాప్ చేశాడు. నిర్మాణుష్య ప్రాంతానికి అతడ్ని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టాడు. అనంతరం పదునైన కత్తితో ఆ కానిస్టేబుల్ ముక్కు, చెవులు, పెదాలు కోసేశాడు. అనుచరులతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ హయత్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పరారైన ఇఫ్తికార్, అతడి అనుచరులను వెతికి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.