వాషింగ్టన్: కృత్రిమ మేధ (ఏఐ) చాట్‌బాట్ చాట్‌జీపీటీతో మనసు విప్పి మాట్లాడేవారు అప్రమత్తంగా ఉండాలని ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ హెచ్చరించారు. మీ డాక్టర్/న్యాయవాది/థెరపిస్టుతో మాట్లాడినపుడు మీ రహస్యాలు గోప్యంగా ఉంటాయని, అటువంటి గోప్యతను చాట్‌జీపీటీతో మాట్లాడినపుడు ఆశించవద్దని చెప్పారు. ఇటీవల ఆయన కమెడియన్ థియో వోన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ఈ హెచ్చరిక చేశారు. యూజర్లు తమ జీవితాల్లోని అత్యంత వ్యక్తిగత విషయాలను చాట్‌జీపీటీకి చెప్తారని శామ్ ఆల్ట్‌మన్ చెప్పారు. ప్రజలు, మరీ ముఖ్యంగా యువత, చాట్‌జీపీటీని తమ థెరపిస్ట్‌గా, లైఫ్ కోచ్‌గా వాడుకుంటున్నారని తెలిపారు.
జీవితంలోని సంబంధాల్లో సమస్యలను చెప్తూ, ‘నేను ఏం చేయాలి?’ అని అడుగుతారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మానవ థెరపిస్టుతో కానీ, న్యాయవాదితో కానీ, వైద్యునితో కానీ ఇలాంటి విషయాలను చెప్పినపుడు, ఆ రహస్య విషయాలకు చట్టబద్ధమైన రక్షణలు ఉంటాయని.. అదే చాట్‌జీపీటీ విషయంలో అటువంటి రక్షణ ఉండదని స్పష్టం చేశారు. చాట్‌జీపీటీతో మాట్లాడిన విషయాలను వెల్లడించాలని న్యాయస్థానం ఆదేశిస్తూ, వాటిని బయటపెట్టక తప్పదని వివరించారు. దీనివల్ల యూజర్ల వ్యక్తిగత గోప్యత పట్ల ఆందోళన వ్యక్తమవుతుందని తెలిపారు. ఈ రికార్డులను సమర్పించాల్సిన చట్టబద్ధ కర్తవ్యం ఓపెన్ఏఐకి ఉందన్నారు.