Canada on Omicron | కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపుతుందన్న హెచ్చరికల మధ్య కెనడా కీలక నిర్ణయం తీసుకున్నది. రెండు డోస్‌ల వ్యాక్సిన్లు తీసుకున్న విదేశీ ప్రయాణికులకు కరోనా ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసింది. ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చే వరకు సదరు ప్రయాణికులంతా క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పస్టం చేసింది.
కెనడా పౌరులు, పర్మినెంట్ రెసిడెండ్లతోపాటు విదేశాల నుంచి కెనడాలోకి వచ్చే ప్రయాణికులంతా.. విమానాశ్రయంలో కరోనా టెస్ట్‌లకు సిద్ధంగా ఉండాలి. కరోనా నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చే వరకు క్వారంటైన్లో ఉండాల్సిందేనని తేల్చేసింది. ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే మాత్రం తప్పనిసరిగా పది రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని వివరించింది. ఈ మేరకు కోవిడ్-19 ఒమిక్రాన్ నియంత్రణకు మార్గదర్శకాలు జారీ చేసింది.