చిసినావ్: యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఒక వృద్ధుడ్ని సజీవంగా పాతిపెట్టాడు. (old man buried alive) నాలుగు రోజుల తర్వాత పోలీసులు అతడ్ని కాపాడారు. అక్కడ గాయాలతో మరణించిన వద్ధురాలిని కూడా ఆ యువకుడు హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. సోవియట్ రిపబ్లిక్లో భాగమైన తూర్పు యూరోపియన్ దేశం మోల్డోవాలో ఈ సంఘటన జరిగింది. ఒక ఇంట్లో 74 ఏళ్ల వృద్ధురాలు మరణించి ఉన్నట్లు ఆమె బంధువు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే పోలీసులకు ఆ సమీపం నుంచి మూలుగులు వినిపించాయి. దీంతో ఒక చొట తవ్వారు. అండర్ గ్రౌండ్లోకి వెళ్లే ప్రవేశ మార్గాన్ని మట్టితో కప్పినట్లు గుర్తించారు. ఆ మట్టిని తొలగించగా నాలుగు రోజుల పాటు లోపల ఉన్న వృద్ధుడ్ని బయటకు తీశారు. చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు.
కాగా, 16 ఏళ్ల యువకుడితో కలిసి తాను మద్యం సేవించినట్లు ఆ వృద్ధుడు తెలిపాడు. తమ మధ్య వాగ్వాదం జరుగడంతో అతడు తనని కొట్టి నేలమాళిగలో ఉంచి ప్రవేశ ద్వారంపైన మట్టికప్పి సజీవ సమాధి చేసినట్లు పోలీసులకు చెప్పాడు.
మరోవైపు అక్కడి ఇంట్లో మరణించిన వృద్ధురాలిని కూడా ఆ యువకుడు హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ యువకుడ్ని అరెస్ట్ చేసి ఈ సంఘటనపై ప్రశ్నిస్తున్నారు. కాగా, నేలమాళిగలో నాలుగు రోజులు సజీవంగా సమాధి అయిన వృద్ధుడ్ని బయటకు తీసి కాపాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.