ఓస్లో: 16 ఏండ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వాడకుండా చేయడంలో ఆస్ట్రేలియా విధానాన్ని అనుసరిస్తున్న దేశాల జాబితాలో నార్వే చేరనుంది. ఈ ఏడాది చివరి నాటికి దీనిపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామని ఆ దేశం శుక్రవారం పేర్కొన్నది. ‘పిల్లలు పిల్లల్లాగే వారి బాల్యాన్ని గడపాలని మేం కోరుకుంటున్నాం.
అందుకోసమే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నాం’ అని నార్వే ప్రధాని జొనాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఆటలు, స్నేహాన్ని, రోజువారీ జీవితాన్ని అల్గారిథమ్‌లు, స్క్రీన్లు లాగేసుకోకూడదు. పిల్లల డిజిటల్ జీవితాలను రక్షించేందుకు ఇదొక ముఖ్యమైన చర్య’ అని ఆయన చెప్పారు. అయితే ఏయే సోషల్ మీడియా వేదికలపై నిషేధం విధించేది ప్రభుత్వం ప్రకటించలేదు.