సియోల్: ప్రపంచ దేశాలు ఎంత ఒత్తిడిచేసిన తగ్గేదే లేదంటున్నది ఉత్తర కొరియా. వరుసగా క్షిపణులను ప్రయోగిస్తూ తన శత్రు దేశాలకు వణుకుపుట్టిస్తున్నది. రోజురోజుకు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ తన జోలికొస్తే ఊరుకునేది లేదంటూ అమెరికా, దక్షిణ కొరియా పాలకులకు హెచ్చరికలు జారీచేస్తున్నది. కిమ్ కింగ్డమ్.. ఉత్తర కొరియా (North Korea) మరోసారి అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని (ICBM) ప్రయోగించింది. అమెరికా-దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించిన 48 గంటల వ్యవధిలోనే అణు క్షిపణిని (Ballistic Missile) ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.
సోమవారం ఉదయం తూర్పుసముద్రం వైపు ఉత్తరకొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని సియోల్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించినట్లు జపాన్ ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. 66 నిమిషాల అనంతరం అది తమ ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ (EEZ)లో పడిందని తెలిపింది.
కాగా, కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ఆదేశంతో హస్వాంగ్-15 (Hwasong 15) ఖండాంతర క్షిపణిని ప్యాంగ్యాంగ్ విమానాశ్రయం నుంచి శనివారం మధ్యాహ్నం ప్రయోగించినట్టు అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. ఇది ప్యాంగ్యాంగ్ (Pyongyang) అణు సామర్థ్యాన్ని ప్రదర్శించిందని పేర్కొంది.