సియోల్: ఉత్తర కొరియా మళ్లీ బాలిస్టిక్ క్షిపణి(Ballistic Missile) పరీక్షించింది. తూర్పు తీరం దిశగా ఆ ప్రయోగం సాగినట్లు దక్షిణ కొరియా మిలిటరీ వెల్లడించింది. సుమారు రెండు నెలల విరామం తర్వాత మళ్లీ ఉత్తర కొరియా తన తొలి మిస్సైల్ పరీక్ష చేపట్టింది. సముద్రంలో కూలిపోవడానికి ముందు ఆ క్షిపణి దాదాపు 1100 కిలోమీటర్లు ప్రయాణించింది. అయితే ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
దక్షిణ కొరియా నేతలతో సియోల్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చర్చలు నిర్వహిస్తున్న సమయంలో ఈ పరీక్ష చేపట్టడం గమనార్హం. ఉత్తర కొరియా నిర్వహిస్తున్న మిస్సైల్ పరీక్షలకు చెందిన సమాచారాన్ని అమెరికాకు చేరవేస్తున్నట్లు దక్షిణ కొరియా తెలిపింది.
మరో వైపు దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. విపక్షాలు ఆయన్ను అభిశంసించాయి.