క్రైస్ట్‌చర్చ్: కేర్ సెంటర్లలో వేధింపులకు గురైన బాధితులకు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లగ్జాన్(PM Christopher Luxon) క్షమాపణలు చెప్పారు. చరిత్రాత్మకమైన ఆ క్షమాపణలను ఆయన పార్లమెంట్లో తెలిపారు. 1950 నుంచి 2019లో దేశంలోని వివిధ రాష్ట్రాలు, మతపరమైన సంరక్షణ కేంద్రాల్లో సుమారు రెండు లక్షల మంది చిన్నారులు, వయోజనలు వేధింపులకు గురైనట్లు తాజాగా ప్రభుత్వం ఓ నివేదికను రూపొందించింది. వీరిలో ఎక్కువ శాతం మావోరి, సపిఫిక్ తెగ ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. మానసిక, శారీర వైకల్యం ఉన్న వారు కూడా ఉన్నారు.
అయితే కేర్ సిస్టమ్‌ను సంస్కరించాలని న్యూజిలాండ్ ప్రభుత్వం తీర్మానించింది. తమ ప్రభుత్వం, గత ప్రభుత్వాల తరపున బాధితులకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రధాని లగ్జాన్ తెలిపారు. అది చాలా భయానకమైందని, గుండె పగిలేలా ఉందని, అలాంటివి ఎప్పటికీ జరగవద్దు అని లగ్జాన్ పేర్కొన్నారు. దాదాపు ఆరేళ్ల పాటు జరిగిన విచారణ తర్వాత రిపోర్టును రిలీజ్ చేశారు. 2300 మంది బాధితులను ఇంటర్వ్యూ చేశారు.