లండన్: యురోప్ దేశాలు ఒకప్పుడు అమెరికాలో బంగారాన్ని(Gold) నిల్వ చేసేవి. కానీ ఇప్పుడు ఆ దేశాలు అమెరికా నుంచి తమ బంగారాన్ని వెనక్కి తెప్పించుకుంటున్నాయి. తాజాగా ఆ జాబితాలో నెదర్లాండ్స్ చేరింది. ఇటీవల ఫ్రాన్స్ కూడా తమ బంగారాన్ని అమెరికా నుంచి వెనక్కి తెప్పించుకున్న విషయం తెలిసిందే. బంగారాన్ని నిల్వ చేయడానికి అమెరికా సురక్షితమని భావించిన యురోప్ దేశాలు ఇప్పుడు తమ ప్రణాళికను మార్చడం పట్ల అంతర్జాతీయంగా గందరగోళం ఏర్పడింది. ఇటీవల డచ్ సెంట్రల్ బ్యాంకు డీ నెదర్లాండ్సీ బ్యాంక్ సుమారు 86 టన్నుల బంగారాన్ని అమెరిసకా, కెనడా నుంచి లండన్‌కు మార్చేసింది. మార్చి, ఆగస్టు నెలల్లో ఆ ఆపరేషన్ సాగినట్లు తెలిసింది. అయితే రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తాము ముందుగానే బంగారాన్ని వెనక్కి తెచ్చుకుంటున్నామని యురోపియన్ దేశాలు చెబుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన వాణిజ్య విధానాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా .. ఇప్పుడే ఎవరికీ అనుకున్నంత సమస్య రాలేదు. కానీ ఎందుకు యురోపియన్ దేశాలు తమ నిల్వ బంగారాన్ని మరో ప్రదేశానికి మారుస్తున్నాయన్నది మాత్రం ఇంకా అర్థం కావడం లేదు. బహుశా ఈ బంగారాన్ని వాడుతామని అనుకోవడం లేదని, కానీ తమకు తాము బలోపేతం కావడం కోసం ముందస్తుగా వెనక్కి తెచ్చేసుకున్నామని డీఎన్బీ ప్రెసిడెంట్ ఓలాఫ్ స్లీజ్పెన్ తెలిపారు. సుమారు 83.8 బిలియన్ల డాలర్ల విలువైన 612.4 టన్నుల బంగారం అమెరికా వద్ద ఉన్నట్లు నెదర్లాండ్స్ చెప్పింది. తమ దగ్గర ఉన్న నిల్వల్లో.. అమెరికా వద్ద 31.3 శాతం, ఒట్టావోలో 19.7 శాతం, జీస్ట్లో 30.8 శాతం, లండన్‌లో 18.1 శాతం బంగారం ఉన్నట్లు నెదర్లాండ్స్ చెప్పింది.
కానీ తాజా చర్యతో లండన్‌లో నెదర్లాండ్స్ బంగారం షేర్ 32.1 శాతానికి పెరిగింది. అమెరికా నుంచి 86 టన్నుల బంగారాన్ని నెదర్లాండ్స్ ఖాళీ చేసింది. కానీ అదేమీ ఫిజికల్‌గా తీసుకెళ్లలేదు. సుమారు 59 టన్నుల బంగారాన్ని అమెరికాలోనే అమ్మేసింది. దానికి రీప్లేస్‌మెంట్‌గా లండన్‌లో ఆ బంగారాన్ని తీసుకున్నది. ఇక 27 టన్నుల బంగారాన్ని మాత్రం అమెరికా, కెనడా నుంచి స్వంత పట్టణం జీస్ట్కు తీసుకెళ్లింది. ఇటీవల అమెరికా, యురోపియన దేశాల మధ్య సంబంధాలు బలహీనపడడం వల్లే ఆ దేశాలు తమ బంగారం నిల్వలను వెనక్కి తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ కూడా తమ బంగారాన్ని వెనక్కి తెచ్చుకున్నది.
జర్మనీకి చెందిన బుందేస్బ్యాంక్ సుమారు 216 టన్నుల బంగారాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నది. న్యూయార్క్ నుంచి 111 టన్నులు, పారిస్ నుంచి 105 టన్నుల బంగారాన్ని జర్మనీ వెనక్కి తీసుకువచ్చింది. యుద్ధాలు, వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని దేశాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీనియర్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ జోసెఫ్ కవటోని తెలిపారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్న కారణంగా.. ఇలాంటి సందర్భాల్లో బంగారంతో వాణిజ్యం చేయాలన్న యోచనలో పలు దేశాలు ఆ నిల్వలను వెనక్కి తెస్తున్నాయి.
బంగారం విక్రయం కోసం లండన్‌ను సురక్షితమైన ప్రాంతంగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బంగారం ట్రేడింగ్ లండన్ నుంచి సాగుతున్నది. అయితే ఒకవేళ సంక్షోభం సంభవిస్తే, చాలా వేగంగా ఇక్కడ నుంచి బంగారాన్ని అమ్మేందుకు, కొనేందుకు అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్.. బంగారం స్టోరేజ్‌కు పాపులర్ పాయింట్‌గా ఉంది. 300 ఏళ్ల క్రితం నాటి ఆ బ్యాంకులో సుమారు 4 లక్షల బంగారం కడ్డీలు ఉన్నట్లు తెలుస్తోంది. వాటి విలువ 200 బిలయన్ల పౌండ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వేల సంవత్సరాల నుంచి బంగారాన్ని పెట్టుబడిగా భావించడం వల్ల.. ఆ విలువైన లోహం ఖరీదు కూడా క్రమంగా పెరుగుతోంది. ఇటీవల బంగారం ధర విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో గోల్డ్ రేటు పెరిగింది.
ఇక ఇప్పుడు ఉన్న ప్రపంచ సంక్షోభాల నేపథ్యంలో ఆ బంగారాన్ని తమ దగ్గరే దాచుకోవాలన్న తపన కూడా పలు దేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.నియంత్రణ లేని రీతిలో బంగారం ధర పెరగడం వల్ల ఆయా దేశాలు తమ బంగారాన్ని తిరిగి తెచ్చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఇండియాలో బంగారం ధరం అమాంతం పెరుగుతూనే ఉన్నది. వీలైనంత వరకు బంగారం కొనవద్దు అని ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ట్రేడింగ్‌లో జరుగుతున్న పరిణామాలు ఎటువంటి దశను క్రియేట్ చేస్తాయో వేచి చూడాల్సిందే.