Titan Submersible | ఎడతెగని సంపద వల్ల కావచ్చు.. జిజ్ఞాస వల్ల కావచ్చు.. ఎవరికీ అలవికాని వింతలు చూసేందుకు సంపన్నులు ఎగబడుతున్నారు. సముద్ర అగాథాలను తాకి రావాలని, అంతరిక్ష అందాలను వీక్షించాలని కలలు గనేవారు కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తాను స్థాపించిన బ్లూ ఆరిజన్ కంపెనీ స్పేస్‌ఫ్లైట్‌లో మరికొందరితో కలిసి అంతరిక్షంలోకి వెళ్లి కొన్ని నిమిషాలు గడిపి వచ్చారు. తాజాగా ప్రపంచ సంపన్నులు కొందరు వందేళ్ల క్రితం మునిగిన టైటానిక్ శకలాలను దగ్గరి నుంచి వీక్షించాలన్న కోరికతో వెళ్లి గల్లంతయ్యారు. అట్లాంటిక్ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ శకలాలను చూపించేందుకు వెళ్లిన టైటాన్ సబ్మెర్సిబుల్ గల్లంతైంది. సహాయక బృందాలు క్షణం తీరిక లేకుండా గాలిస్తున్నాయి.
గల్లంతైనప్పుడు టైటాన్లో 96 గంటల పాటు ప్రాణాలను నిలిపేంత ఆక్సిజన్ నిల్వలు ఉన్నప్పటికీ క్రమంగా కరిగిపోయి చివరి క్షణాలకు చేరుకున్నాయి. గంటలు గడిచిపోతుండడంతో ఇలా అయితే లాభం లేదని చివరి ప్రయత్నంగా ‘విక్టర్ 6000’గా పిలిచే రోబోను సముద్ర గర్భంలోకి పంపినట్టు యూఎస్ కోస్ట్‌గార్డు తెలిపింది. దీనికి సముద్రంలో 20 వేల అడుగుల వరకు చేరుకోగలిగే సామర్థ్యం ఉంది. గల్లంతైన సబ్మెర్సిబుల్ నుంచి రెండు రోజుల క్రితం శబ్దాలు వచ్చి ఆశలు నింపినా అవి కచ్చితంగా ఎక్కడి నుంచి వస్తున్నాయన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. టైటాన్‌ను వెతికేందుకు పంపిన రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్ (ఆర్వోవీ) గతంలో మునిగిన టైటానిక్ నౌక సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్టు అమెరికన్ కోస్ట్‌గార్డ్ వెల్లడించింది. కానీ ఆ శకలాలు టైటాన్వా ? కాదా? అనేది ఇంకా స్పషంగా తెలియలేదు. గల్లంతైన టైటాన్ పొడవు 6.5 మీటర్లు. ఎత్తు 3 మీటర్లు.
111 సంవత్సరాల క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ మునిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఓ జంటతో ఓషన్‌గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్కు సంబంధం ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. టైటానిక్ ప్రమాదంలో ఇసిడార్ స్ట్రాస్-ఇడాస్ట్రాస్ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. స్టాక్టన్ రష్ భార్య వెండీ రష్.. ఈ జంట వారసురాలే.
ఓషన్ ఎక్స్‌ప్లోరర్ వెబ్సైట్ ప్రకారం.. సబ్‌మెరైన్ (జలాంతర్గామి) సొంతంగానే పోర్టు నుంచి వెళ్లి తిరిగి వెనక్కి రాగలదు. కానీ, సబ్మెర్సిబుల్కి అంత శక్తి లేదు. అది పోర్టును విడిచిపెట్టాలంటే దానికి మదర్షిప్ సాయం అవసరం. సబ్మెర్సిబుల్లో పలు రకాలు ఉన్నాయి. రియల్‌టైమ్‌లో రిమోట్‌తో ఆపరేట్ చేసేవి, ముందుగానే ప్రోగ్రామ్ చేయడం ద్వారా ప్రయాణించేవి, గల్లంతైన టైటాన్‌ను పోలినవి మరికొన్ని. వీటిలో సిబ్బంది ఉండి నడిపిస్తారు. అంటే నీటిలో 10 గంటలు మాత్రమే ఉండగలదు. నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉంటాయి. గరిష్ఠంగా ఐదుగురు మాత్రమే ప్రయాణించగలరు. సబ్‌మెరైన్ ఫుట్‌బాల్ మైదానం కంటే పెద్దగా ఉంటుంది. ఆక్సిజన్‌ను అది సొంతంగా తయారుచేసుకోగలదు. కొన్ని నెలలపాటు నీటి అడుగున ఉండగలదు.
– నేషనల్ డెస్క్