మిషిగన్: అందరూ తమకు లాటరీ తగలాలని కోరుకుంటారు. కానీ అదృష్టం కొందరినే వరిస్తుంది. తాజాగా అమెరికాలోని మిషిగన్‌కు చెందిన అరోన్ ఎస్సెన్మాకర్ (50)కి బంపర్ లాటరీ తగిలింది. జీవితాంతం ఏడాదికి రూ.20 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. వారెన్ హ్యాపీ డేస్ పార్టీ స్టోర్‌లో లాటరీ టికెట్ కొన్నాడు. ఆన్లైన్లో ర్యాండమ్ జనరేటర్ నంబర్ ఆధారంగా టికెట్ నంబర్లను ఎంచుకున్నాడు. డ్రా జరిగిన మరుసటి రోజు ఫలితాలు చూసుకున్నానని, తన నంబర్‌కు లాటరీ తగిలిందని తెలిసి ఆశ్చర్యపోయానని ఎస్సెన్మాకర్ తెలిపాడు. రూ. 20 లక్షలు జీవితాంతం కాకుండా ఒకేసారి రూ.3.2 కోట్లు తీసుకొనేందుకు ఎంచుకున్నానని, వాటితో తన అప్పులు తీర్చుకొని, మిగిలిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటానని చెప్పాడు. టూర్లకు వెళ్లడమంటే తనకు ఎంతో ఆసక్తి అని ఆ కోరికను ఇప్పుడు తీర్చుకుంటానని పేర్కొన్నాడు.