మన ఫోన్ ఎక్కడో రోడ్డు మీద పడిపోతేనే మళ్లీ చేతికిరాదు. కానీ, ఓ వ్యక్తి పది నెలల క్రితం నదిలో జారవిడుచుకున్న ఫోన్ మళ్లీ అతడి చేతికి దొరికింది. అదికూడా పనిచేసే స్థితిలో తనకు చేరడంతో ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. నిజంగా ఇది తన ఫోనేనా? అని దాన్ని తేరిపార చూస్తుకున్నాడు. ఈ వింత, అరుదైన సంఘటన యూకేలో జరిగింది.
డేవిస్ అనే వ్యక్తి పదినెలల క్రితం అతడికి కాబోయే భార్య, స్నేహితులతో కలిసి నదిలో పడవ ప్రయాణం చేశాడు. ఈ సమయంలో డేవిస్ ఐ ఫోన్ చేజారి నదిలో పడిపోయింది. అతడు దానిపై ఆశలు వదులుకున్నాడు. కాగా, ఈ ఫోన్ అదే నదిలో పచేకో అనే వ్యక్తికి దొరికింది. అతడు ఆ ఫోన్‌ను ఇంటికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్ కంప్రెషర్‌తో లోపల, బయట ఆరబెట్టాడు.
పచేకో.. ఆ మొబైల్ స్క్రీన్ సేవర్‌పై ఉన్న జంట ఫొటోను ఫేస్బుక్లో షేర్చేశాడు. తనకు ఐ ఫోన్ దొరికిందని పోస్ట్‌లో రాశాడు. ఆ ఫోన్ యజమాని ఓవైన్ డేవిస్, అతని కాబోయే భార్య ఫియోనా గార్డనర్‌గా స్నేహితులు గుర్తించారు. ఈ విషయం పచేకోకు తెలుపగా, అతడు ఐ ఫోన్‌ను ఆ జంటకు ఇచ్చేశాడు. ఫోన్ తీసుకున్న వెంటనే డేవిస్ చార్జింగ్ పెట్టగా, అది ఆన్ కావడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన ఫోన్‌ను గుర్తించి, సురక్షితంగా కాపాడి ఇచ్చినందుకు పచేకోకు డేవిస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.