కౌలాలంపూర్, డిసెంబర్ 14: ఒళ్లొంచి పని చేసే తత్వం ఉండాలే కానీ చేసుకునేందుకు ఈ భూమి మీద రకరకాల వృత్తులు ఉన్నాయి. ఇందులో ఒకటి ‘గోల్ఫ్ బాల్ డైవింగ్’. అరుదైన ఈ వృత్తిని ఎంచుకొని నెలకు లక్షన్నర రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడో మలేషియన్.
సుమది ఇబ్రహీం(51) అనే వ్యక్తి 22 ఏండ్ల పాటు మలేషియా నౌకాదళంలో పని చేశాడు. పదవీ విరమణ తర్వాత కుటుంబానికి భారం కాకుండా ఉండేందుకు ఏదైనా పని చేయాలనుకున్నాడు. కానీ, ఈత కొట్టడం మినహా ఆయనకు ఇతర నైపుణ్యాలేవీ పెద్దగా లేవు. ఈ సమయంలో స్నేహితుల ద్వారా ఇబ్రహీంకు ఈ గోల్ఫ్ బాల్ డైవింగ్ పని గురించి తెలిసింది. గోల్ఫ్ ఆడేటప్పుడు చాలా బంతులు నీటి కుంటల్లో పడిపోతుంటాయి. ఈ బంతులను వెతికి పట్టుకోవడమే గోల్ఫ్ బాల్ డైవింగ్. కౌలాలంపూర్‌లోని ఓ గోల్ఫ్ కోర్టులో ప్రతి రోజూ రాత్రిపూట ఇబ్రహీం నీటి కుంటల్లోకి దిగి బంతులు వెతికితీస్తాడు.
వీటిని శుభ్రం చేసి, తెల్లవారి అక్కడే గోల్ఫ్ ఆడే క్రీడాకారులకు విక్రయిస్తుంటాడు. పదేండ్ల నుంచి ఆయనది ఇదే పని. ఈ పని చేయడం ద్వారా తనకు నెలకు లక్షన్నర వరకు సంపాదన ఉందని ఇబ్రహీం చెప్తున్నాడు. ప్లాస్టిక్, రబ్బర్‌తో కలిపి చేసే బంతులు నీటి కుంటల్లో పడిపోవడం పర్యావరణానికి హానికరం. వాటిని వెతికితీయడం ద్వారా ఇబ్రహీం పరోక్షంగా పర్యావరణానికి సైతం మేలు చేస్తున్నాడు.