వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. తన సామర్థ్యం గురించి తన చుట్టూ ఉన్నవారికి బాగా తెలుసని ఆమె చెప్పారు. ఇటీవల ‘వాల్ స్ట్రీట్ జర్నల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు నేను సిద్ధం. అందులో ఎలాంటి సందేహం లేదు. నన్ను గమనించిన ప్రతి ఒక్కరికీ నా సామర్థ్యం గురించి తెలుసు’ అని ఆమె అన్నారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (81) వయసు, జ్ఞాపకశక్తిపై విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో కమలా హారిస్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.