బీరుట్: ఇజ్రాయిల్ రక్షణ దళాలు కీలక ప్రకటన చేశాయి. లెబనాన్ రాజధాని బీరుట్‌పై జరిపిన వైమానిక దాడిలో.. హిజ్బొల్లా హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన కమాండర్(Hezbollah commander) సుహేల్ హుస్సేన్ హుస్సేని హతమైనట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. ఇరాన్, హిజ్బొల్లా మధ్య ఆయుధాల సరఫరా విషయంలో కమాండర్ హుస్సేన్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. హుస్సేన్ మృతిపై ఐడీఎఫ్ ప్రకటన చేసి.. ఇప్పటి వరకు మాత్రం హిజ్బొల్లా ఎటువంటి ప్రకటన చేయలేదు.
గత రాత్రి బీరుట్లో భీకర స్థాయిలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. శివారు ప్రాంతమైన దహియేలో సుమారు పది ప్రదేశాల్లో వైమానిక దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. లెబనాన్, సిరియా సాయంతో ఇజ్రాయిల్‌పై దాడి చేయడంలో హుస్సేన్ కీలక పాత్ర పోషించినట్లు ఐడీఎఫ్ చెప్పింది. హిజ్బొల్లా సీనియర్ మిలిటరీ నాయకత్వ గ్రూపునకు చెందిన జిహాద్ కౌన్సిల్లో హుస్సేని సభ్యుడిగా ఉన్నారు.