Israel-Hamas War | దోహా, జనవరి 15: గత 15 నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధానికి తెరపడింది. ఇరు వర్గాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు బుధవారం మధ్యవర్తులు ప్రకటించారు. కొన్ని వారాల క్రితం నుంచి ఖతార్ రాజధానిలో ఎడతెరపి లేకుండా జరిగిన చర్చల అనంతరం ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగా హమాస్ చేతిలో ఉన్న డజన్ల కొద్దీ బందీలను విడతల వారీగా విడుదల చేస్తారు.
అలాగే ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వందలాది పాలస్తీనా ఖైదీలను ఆ దేశం విడుదల చేస్తుంది. అలాగే గాజా యుద్ధం కారణంగా దేశం విడిచిపోయిన వేలాది మంది తమ ఇళ్లకు తిరిగి రావడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. అలాగే యుద్ధం కారణంగా ధ్వంసమైన ప్రాంతాలకు మానవతా దృష్టితో సాయం అందజేస్తుంది. ఒప్పందం జరిగిన విషయాన్ని ముగ్గురు అమెరికా అధికారులు, ఒక హమాస్ ప్రతినిధి నిర్ధారించగా, పూర్తి వివరాలు రావాల్సి ఉందని ఇజ్రాయెల్ సీనియర్ అధికారి తెలిపారు.
మాస్కో, జనవరి 15: ఇంధన రంగ సంస్థలే లక్ష్యంగా పోలాండ్ సరిహద్దు సమీపంలో ఉక్రెయిన్‌పై రష్యా వాయుసేన భీకర దాడులు చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల మేరకు టీయూ-22, టీయూ-95 బాంబర్లు గత 24 గంటల్లో పోలాండ్ సరిహద్దు ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించాయి. పలు క్షిపణులు పోలాండ్ సరిహద్దు ప్రాంతాల్లో పడటంతో అప్రమత్తమైన పోలాండ్లోని నాటో దళాలు బుధవారం ఎదురుదాడికి దిగాయి.
భూతల ఆధారిత వాయుసేన, రాడార్ వ్యవస్థలను పూర్తిగా అప్రమత్తం చేసినట్టు పోలాండ్ తెలిపింది. ఇంధన మౌలిక రంగాలు లక్ష్యంగా మరోసారి ఉక్రెయిన్‌పై రష్యా వాయుసేన భారీ దాడులకు దిగినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎక్స్‌లో తెలిపారు. ఇంధన, గ్యాస్ సంస్థలు లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులు సహా మొత్తం 40 మిస్సైల్స్‌ను తమపై రష్యా ప్రయోగించిందని, అందులో 30కు పైగా కూల్చివేసినట్టు తెలిపారు. రాత్రిపూట అదనంగా 70 రష్యా డ్రోన్లతో దాడి జరిగిందని చెప్పారు.