Iran-Israel : ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా తగ్గినట్లు కనిపించడం లేదు. ఈ ఒప్పందాన్ని స్వాగతించిన ఇజ్రాయెల్.. ఇది లెబనాన్‌కు మాత్రం వర్తించబోదని చెప్పింది. అలాగే, దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. దీనిపై ఇరాన్ స్పందించింది. లెబనాన్‌పై దాడులు ఆపకుంటే ఇజ్రాయెల్‌పై తాము కూడా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరానియన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘మరికొన్ని గంటల్లోగా దక్షిణ లెబనాన్‌పై దాడులు ఆపకపోతే.. మేం ఇజ్రాయెల్‌పై వైమానిక, క్షిపణి దాడులు చేస్తాం’’ అని హెచ్చరించింది. అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరాన్.. తమతోపాటు లెబనాన్ వంటి తమ మిత్ర దేశాలపై కూడా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలని డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని మధ్యవర్తిత్వం వహించిన పాక్ కూడా ధృవీకరించింది. లెబనాన్‌కు కూడా కాల్పుల విరమణ ఒప్పందం వర్తిస్తుందని పాక్ ప్రధాని షెహబాజ్ కూడా స్పష్టం చేశాడు. కానీ, ఇజ్రాయెల్ దీన్ని ఖండించింది. ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని స్పష్టం చేసింది. లెబనాన్‌లోని ఇరాన్ మద్దతుగా ఉన్న హెజ్బొల్లా తీవ్రవాద స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా, లెబనాన్‌లోని ఒక పట్టణానికి ఇజ్రాయెల్ హెచ్చరిక జారీ చేసింది. అక్కడి ప్రజలందరూ నగరం నుంచి తరలివెళ్లాలని సూచించింది. ఇప్పటిదాకా అటు ఇరాన్‌పై విరుచుకుపడుతూనే, ఇటు లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది.
ఈ దాడులకు బదులుగా హెజ్బొల్లా కూడా ఎదురు దాడికి దిగింది. కానీ, అమెరికాతో ఇప్పుడు కుదిరిన కాల్పుల ఒప్పందం ప్రకారం హెజ్బొల్లా కూడా కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా బుధవారం ఉదయం దుబాయ్, సౌదీ, కువైట్ వంటి గల్ఫ్ దేశాలపై కొన్ని క్షిపణుల్ని ప్రయోగించినట్లు సమాచారం. అయితే, వాటిని క్షిపణి రక్షక వ్యవస్థలు అడ్డుకున్నట్లు ఆ దేశాలు ప్రకటించాయి.