టెహ్రాన్, జూన్ 18: ఇజ్రాయెల్‌తో యుద్ధం కారణంగా ఇరాన్లో మంగళవారం దాదాపు పూర్తిగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ సైబర్ దాడుల నేపథ్యంలో వీపీఎన్‌లు, యాప్స్టోర్లు, ప్రధాన మెసేజింగ్ యాప్‌ల సేవలను పరిమితం చేశారు. దీంతో యుద్ధం వేళ ఇరాన్‌తో ప్రపంచ దేశాలకు కమ్యూనికేషన్ సౌకర్యాలను ఆ దేశం పరిమితం చేసింది. 2019లో కూడా ఇరాన్ వరుసగా ఆరు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలపివేసింది. కొత్త యాప్‌లు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోకుండా ఇరాన్ ప్రభుత్వం ఇటీవల గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లపై కూడా ఆంక్షలు విధించింది. కాగా, మెసేజింగ్, కాలింగ్ యాప్ వాట్సాప్‌ను తమ స్మార్ట్ ఫోన్ల నుంచి తొలగించాలంటూ ఇరాన్ ప్రభుత్వం మంగళవారం తమ పౌరులకు విజ్ఞప్తి చేసింది.
ఇరాన్లో 585 మంది మృతి ; ప్రకటించిన మానవ హక్కుల సంస్థ
దుబాయ్, జూన్ 18: ఇరాన్‌పై ఇజ్రాయెల్ తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు టెహ్రాన్‌లో 585 మంది మరణించగా, 1,326 మంది గాయపడ్డారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. మరణించిన వారిలో 239 మంది పౌరులు, 120 మంది భద్రతా దళాలకు చెందిన వారు ఉన్నట్టు తెలిపింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ 400 క్షిపణులు, వందలాది డ్రోన్లు ప్రయోగించగా, ఇప్పటివరకు 24 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు.