జెరుసలాం: ఇజ్రాయిల్, హమాస్ మధ్య సాగుతున్న పోరుతో.. గాజా సిటీలో తీవ్ర దుర్భిక్ష(Gaza Famine) పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సిటీలో ఆర్తనాదాలు వినిపిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన శాఖ ద్రువీకరించింది. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూర్టీ ఫేస్ క్లారిఫికేషన్(ఐపీసీ) తొలిసారి తన వార్నింగ్‌ను అయిదో దశకు చేర్చింది. ఆ వార్నింగ్ స్థాయి బట్టి.. గాజాలో తీవ్ర దుర్భిక్షం ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. గాజాలోని గాజా సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నట్లు రిపోర్టులో వెల్లడించారు. ఆ తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఈనెలాఖరులోగా డెయిర్ అల్ బాలాహ్, ఖాన్ యూనిస్‌కు కూడా చేరనున్నట్లు తెలుస్తోంది.
గాజా స్ట్రిప్‌లో ఉన్న సుమారు అయిదు లక్షల మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. దుర్భిక్ష పరిస్థితులకు చెందిన రకరకాల విశ్లేషణను ఐపీసీ అందిస్తుంది. దీనిలో భాగంగా యూఎన్‌కు చెందిన ఐపీసీ శాఖ.. 59 పేజీల నివేదికను తయారు చేసింది. అయితే ఐపీసీ ఇచ్చిన నివేదికలో నిజం లేదని ఇజ్రాయిల్ ఆరోపించింది. ఐపీసీ అంచనా వేసిన విధానాలను తప్పుపడుతున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. హమాస్ చెప్పిన అబద్ధాలను ఐపీసీ తన రిపోర్టులో చెప్పిందని ఇజ్రాయిల్ ఆరోపించింది.
గాజాలో ఉన్న మరో ఇద్దరు గవర్నర్ల అభిప్రాయాలను ఇంకా సేకరించలేదని ఐపీసీ చెబుతోంది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెర్రస్ మాత్రం ఐపీసీ నివేదిక పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో భయానక పరిస్థితులు ఉన్నాయని ఆ నివేదిక ద్వారా తెలుస్తోందన్నారు. గాజా పరిస్థితులకు మిస్టరీ కారణం కాదు అని, ఆ విపత్తు మానవ విధ్వంసం అని ఆయన పేర్కొన్నారు. మానవత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దుర్భిక్షం కేవలం ఆకలి బాధకు సంబంధించిన అంశం కాదు అని, మానవ మనుగడకు కావాల్సిన అన్ని వ్యవస్థలు కుప్పకూలాయని ఆయన ఆరోపించారు.
తక్షణమే గాజాలోకి ఆహారాన్ని పంపాలని యూఎన్‌కు చెందిన నాలుగు శాఖలు డిమాండ్ చేశాయి. ఎఫ్ఏవో, యునిసెఫ్, డబ్ల్యూఎఫ్‌పీ, డబ్ల్యూహెచ్‌వోలు సంయుక్త ప్రకటన చేశాయి. గాజాలో వెంటనే కాల్పుల విమరణ పాటించాలని ఆ సంస్థలు డిమాండ్ చేశాయి. ఆకలి చావులను అడ్డుకోవాలంటే నిరవధిక సాయం అందాలన్నాయి.