ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 62 మంది భారతీయులు.. నార్త్ ఆఫ్రికా దేశం సూడాన్‌లో చిక్కుకుపోయారు. వాళ్ల దగ్గర పాస్‌పోర్ట్ లేదు.. డబ్బులు కూడా లేవు. దీంతో తమ దేశానికి వెళ్లేదెలా అంటూ మొరపెట్టుకుంటున్నారు. సూడాన్‌లోని నోబుల్స్ గ్రూప్ కంపెనీలో పనిచేస్తున్న ఇండియన్స్ పరిస్థితి ఇది.
సంవత్సరం నుంచి జీతాలు లేవు. పాస్‌పోర్ట్ లాక్కున్నారు. చివరకు మూడు పూటలా తిండి కూడా లేదు.. ఇప్పుడు ఇండియాకు ఎలా వెళ్లాలి అంటూ ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు వాపోతున్నారు.
సుడాన్‌లోనే నోబుల్స్ గ్రూప్ అనేది అతి పెద్ద సెరామిక్ టైల్స్ కంపెనీ. అయితే.. ఒకప్పుడు సుడాన్ వేరు. ఇప్పటి సుడాన్ వేరు. సుడాన్ ఎప్పుడైతే రిపబ్లిక్‌గా అవతరించిందో అప్పటి నుంచి అక్కడ పనిచేసే వర్కర్ల కష్టాలు మొదలయ్యాయి.
గత అక్టోబర్‌లో సైనికుల తిరుగుబాటు చర్య వల్ల.. ప్రస్తుతం అక్కడ మిలిటరీ ప్రభుత్వం నడుస్తోంది. దీంతో నోబుల్ కంపెనీ ఓనర్ మహమ్మద్ మామౌన్.. వేరే దేశం పారిపోయాడు. దీంతో నోబుల్స్ గ్రూప్ కంపెనీని అక్కడి మిలిటరీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి అక్కడ పనిచేసే వర్కర్లకు జీతాలు సరిగ్గా ఇవ్వకుండా వాళ్ల పాస్‌పోర్ట్‌ను లాక్కొని వాళ్లను దేశం విడిచి వెళ్లకుండా చేస్తున్నారని వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్‌లోని పలు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ప్రస్తుతం నోబుల్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. నోబుల్స్ కంపెనీకి పలు బ్రాంచ్‌లు ఉన్నాయి. రాక్ సెరామిక్స్ ఫ్యాక్టరీ, ఏఎల్ మసా పోర్సెలైన్ ఫ్యాక్టరీలో ఇండియన్స్ పనిచేస్తున్నారు.
ఇంటికి మేము డబ్బులు పంపించాల్సింది పోయి.. మాకే ఇంటి నుంచి డబ్బులు వస్తున్నాయి. తినడానికి.. ఉండటానికి డబ్బులు లేక.. ఇంటి దగ్గర్నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజుకు ఒక పూట తినడం, కొన్ని రోజులు ఏం తినకుండా పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.. అని రాక్ సెరామిక్స్‌లో పనిచేస్తున్న ఉపేంద్ర పాండే అన్నాడు.
చివరకు సుడాన్ రాజధాని ఖార్టౌమ్లో ఉన్న ఇండియన్ ఎంబసీని కూడా రాక్ సెరామిక్స్, ఏఎల్ మసా ఫ్యాక్టరీ ఉద్యోగులు సంప్రదించారు. జీతాలు ఇవ్వకున్నా.. పని ఇవ్వకున్నా పర్లేదు కానీ.. తమ పాస్‌పోర్ట్స్‌ను తమకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని వారు ఇండియన్ ఎంబసీని కోరారు.
మీ పాస్పోర్ట్స్ మీకు ఇప్పిస్తామని ఇండియన్ ఎంబసీ మాటిచ్చింది. కానీ ఎప్పుడు.. కొన్ని వారాల నుంచి ఇండియన్ ఎంబసీ వద్ద పడిగాపులు కాస్తున్నాం. కానీ.. ఇప్పటి వరకు మా పాస్‌పోర్టులు మా చేతికి రాలేదు. ఇక్కడి నుంచి ఎంత త్వరగా ఇండియాకు వెళ్లే అవకాశం దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నాం. కానీ.. మాకు ఎటువంటి అవకాశం రావడం లేదు.. అని పాండే తెలిపాడు.
అయితే.. ప్రస్తుతానికి వాళ్ల అవసరాల కోసం ఇండియన్ ఎంబసీ కొన్ని డబ్బులు ఇచ్చి ఆదుకున్నట్టు వర్కర్స్ తెలిపారు. తమను ఇక్కడికి తీసుకొచ్చిన సూపర్వైజర్ కూడా తమను మోసం చేశాడని.. కంపెనీ తమ వీసాలను రెసిడెన్స్ వీసాలుగా ఇప్పటి వరకు మార్చేయాలని.. అది కూడా జరగలేదని వర్కర్స్ చెప్పారు.
తమ వీసా గడువు ముగిసిపోవడంతో వాటిని రెసిడెన్స్ వీసాలుగా మార్చకపోతే ఇక్కడి నుంచి ఇండియా వెళ్లేటప్పుడు ఫైన్ కట్టాల్సి ఉంటుందని.. ఇమ్మిగ్రేషన్‌కు ఫైన్ కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలని వర్కర్లు వాపోతున్నారు. దీనికి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో.. ఎప్పుడు ఆ నరకం నుంచి బయట పడి తమ సొంత దేశంలో అడుగు పెట్టాలా అని అక్కడ చిక్కుకుపోయిన 62 మంది ఇండియన్స్ కంటిమీద కునుకు లేకుండా ఎదురుచూస్తున్నారు.