వాషింగ్టన్, ఫిబ్రవరి 14: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఇండియన్ అమెరికన్ నిక్కీ హేలి నిలిచారు. మంగళవారం ఆమె ప్రచారా న్ని ప్రారంభించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆమె అమెరికా మాజీ అధ్యక్షు డు డోనాల్డ్ ట్రంప్‌తో పోటీ పడుతున్నారు. 51 ఏండ్ల నిక్కీ హేలీ ఐరాసలో అమెరికా అంబాసిడర్‌గా పని చేశారు. రెండు పర్యాయాలు సౌ త్ కరోలినా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. పంజా బీ సిక్కు కుటుంబానికి చెందిన నిక్కీ హేలీ అస లు పేరు నిమ్రత నిక్కీ రంధావా. 1960లో వీరి కుటుంబం పంజాబ్ నుంచి అమెరికాకు వలసవెళ్లింది. 2016లో బాబీ జిందాల్, 2020లో కమలా హ్యారిస్ కూడా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు.
పోటీలో వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష రేసులో నిలవాలని భారతీయ అమెరికన్, ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కూడా యోచిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం నిక్కీ హేలీతో ఆయన పోటీ పడనున్నారు. భారతీయులైన వివేక్ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. వివేక్ అమెరికాలోని సిన్సినాటిలో జన్మించారు. హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేసిన ఆయన బయోటెక్ పరిశ్రమను స్థాపించి విజయవంతమైన వ్యాపారవేత్తగా, మిలియనీర్‌గా ఎదిగారు. రిపబ్లికన్ పార్టీ నేతలతో మంచి సంబంధాలు కలిగిన ఆయన ఈసారి అధ్యక్ష బరిలో తన అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారు.