Rishi Sunak | ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తిలపై వారి అల్లుడు, బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ ప్రశంసల వర్షం కురిపించారు. తన మామ నారాయణమూర్తికి సంపన్న కుటుంబ నేపథ్యమే లేదన్నారు. ఓ టీవీ చానెల్ చర్చాగోష్టిలో పాల్గొన్న రిషి సునాక్.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి-సుధామూర్తి దంపతుల ప్రస్థానంపై స్పందించారు. వారిని చూసి గర్విస్తున్నానని చెప్పారు.
ఆశయం ఉన్నా.. చేతిలో చిల్లిగవ్వకూడా లేని తన మామ నారాయణమూర్తికి, తన అత్త సుధామూర్తి కొన్ని వందల పౌండ్లు ఇవ్వడంతో మొదలైన ప్రయాణంలో ప్రపంచంలోనే అతిపెద్ద, గౌరవించదగ్గ సంస్థను నెలకొల్పారని చెప్పారు. ఆ సంస్థలో వేలమంది బ్రిటన్ పౌరులు ఉపాధి పొందుతున్నారని అన్నారు. తన భార్య అక్షత కుటుంబ సంపదపై వచ్చిన విమర్శలపై రిషి సునాక్ గట్టిగానే స్పందించారు. తాను బ్రిటన్ ప్రధానినైతే, తన అత్తామామలు సాధించిన స్ఫూర్తిదాయక గాథలను బ్రిటన్లోనూ సృష్టించగలనని విశ్వాసం వ్యక్తం చేశారు.
తానెప్పుడూ బ్రిటన్లోని ఓ సాధారణ పన్ను చెల్లింపుదారుడినేనని రిషి సునాక్ స్పష్టం చేశారు. తన భార్య మరో దేశానికి వ్యక్తి అయినందున ఆమెను విడిగా చూడాలన్నారు. గతంలో ఆమెపై వచ్చిన విమర్శలకు అక్షతమూర్తి వివరణ ఇచ్చినందున ఆ వివాదం ముగిసిందని చెప్పారు. తన అత్తామామల విజయ గాధ తనకు ఎంతో గర్వ కారణం అని అన్నారు. బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నేతగా, తదుపరి బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ పోటీ పడుతున్నారు. ఆయనకు పెన్నీ మోర్డాంట్, బాడ్నోచ్, లిజ్ క్రస్ గట్టిపోటీ ఇస్తున్నారు.