సింగపూర్: రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని స్మార్ట్ వాచ్ కాపాడింది. సెప్టెంబర్ 25న సింగపూర్‌లో రాత్రి వేళ బైక్‌పై వెళ్తున్న మహమ్మద్ ఫిత్రిని ఒక వ్యాన్ ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిన అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం తర్వాత అతడు స్పృహ కోల్పోయాడు. రాత్రి వేళ కావడంతో అతడ్ని కాపాడేందుకు ఎవరూ సమీపంలో లేరు. అయితే ఫిత్రి చేతికి ఉన్న ఆపిల్ వాచ్ ఆటోమేటిక్‌గా స్పందించింది. వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేసింది. అతడు పడి ఉన్న లోకేషన్‌ను కూడా షేర్ చేసింది.
దీంతో సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది స్పందించారు. శనివారం రాత్రి 8.20కి ప్రమాదం గురించి తమకు అలెర్ట్ వచ్చిందని, వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదంలో గాయడిపన అతడ్ని ఆసుపత్రికి తరలించినట్లు సంబంధిత అధికారి తెలిపారు.
కాగా, ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై జన సంచారం లేకపోవడంతో ఫిత్రికి సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని జరిగిన ఘటన గురించి అతడి స్నేహితురాలు తెలిపింది. అదృష్టవశాత్తు ధరించిన స్మార్ట్ వాచ్‌లో చార్జ్ ఉండటంతో దాని అలెర్ట్ వల్ల అతడు ప్రాణాలతో బయటపడినట్లు ఆమె చెప్పింది. అతడి ఆపిల్ స్మార్ట్ వాచ్ నుంచి తనకు కూడా అలెర్ట్ వచ్చినట్లు వెల్లడించింది.
మరోవైపు మహమ్మద్ ఫిత్రి రోడ్డు ప్రమాదానికి గురై కిందపడటంతో హార్డ్ ఫాల్‌ను గుర్తించే ఆపిల్ వాచ్ ఫీచర్ యాక్టివేట్ అయ్యిందని, దీంతో అతడికి సహాయం కోసం ఒక SOS సందేశాన్ని అది పంపించిందని చైనా వార్తా సంస్థ లియాన్హే వాన్బావో పేర్కొంది.
ఒక వ్యక్తి స్పృహలో ఉన్నాడా లేడా, కదులుతున్నాడా లేదా అని కూడా ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్ తనిఖీ చేస్తుందని తెలిపింది. వ్యక్తిలో కదలిక లేదా స్పృహలో లేకపోతే ఆ స్మార్ట్‌వాచ్‌లో ముందుగా సెట్ చేసిన అత్యవసర సర్వీస్ నంబర్, ఇతర నంబర్లకు ఆటోమేటిక్‌గా డయల్ చేస్తుందని ఆ వార్తా కథనంలో వివరించింది.