Biden Vs Hillary | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సారధ్యంలోని ప్రభుత్వం తీరును ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తప్పుబట్టారు. అమెరికాతోపాటు యూరోపియన్యూనియన్ సభ్య దేశాల ప్రభుత్వాలు రష్యన్ యూజర్లు క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరుపకుండా నిలువరించలేకపోయారని విమర్శించారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ఆర్థిక పరమైన సమస్యలను అధిగమించడానికి రష్యన్లు క్రిప్టో కరెన్సీల్లో లావాదేవీలు జరిపేందుకు పుతిన్ సర్కార్ అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యన్లు క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరుపకుండా నివారించే విషయమై నియంత్రణ సంస్థలు కఠినంగా వ్యవహరించడం లేదని క్లింటన్ మండి పడ్డారు. క్రిప్టో కరెన్సీల వాడకంతో రష్యన్లు తప్పించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు వెసులుబాటు కల్పించొద్దన్నారు. అందుకు కారణాలను వివరించారు.
రష్యన్ యూజర్ల ఖాతాలను బ్లాక్ చేయడానికి కొన్ని ప్రధాన క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లు నిరాకరించాయి. బినాన్స్ గత నెల 28న స్పందిస్తూ లక్షల మంది అమాయక ఖాతాదారుల అకౌంట్లను ఏకపక్షంగా స్తంభింప జేయలేమని స్పష్టం చేసింది. రష్యన్లు జరిపే లావాదేవీలపై పూర్తి నిషేధం విధించలేమని కాయిన్ బేస్ పేర్కొంది. చట్టాల్లేకుండా రష్యన్ క్లయింట్ల ఖాతాలను ఫ్రీజ్ చేయలేమని ఒక క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ సీఈవో క్రాకెన్ జెస్సే పావెల్ ఇటీవల అన్నారు. కుకాయిన్, కాయిన్ బెర్రీ కూడా బినాన్స్ బాటలోనే పయనిస్తామని తెలిపాయి.