బీజింగ్: రైలు ప్రయాణంలో వేగానికి సరికొత్త అర్థం చెప్తూ చైనా మరో ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సీఆర్ 450 హై స్పీడ్ రైలును ఆవిష్కరించింది. ఈ రైలు ప్రస్తుతం షాంఘై-చోంగ్క్వింగ్-చెంగ్డూ మార్గంలో తొలి పరీక్షలను ప్రారంభించింది. గతంలో జరిగిన పరీక్షల్లో ఈ రైలు గంటకు ఏకంగా 453 కిలోమీటర్లు (281 మైళ్లు) గరిష్ఠ వేగాన్ని అందుకుని, తన రికార్డు సామర్థ్యాన్ని నిరూపించింది. వాణిజ్య సేవల్లో ఇది గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుగా రూపొందించారు. ప్రస్తుతం గంటకు 350 కి.మీ.
వేగంతో ప్రయాణిస్తున్న పాత రైలు సీఆర్ 400 ఫ్యుక్సింగ్ మోడల్‌తో పోలిస్తే సీఆర్450 రైలులో అనేక మార్పులు చేశారు. పొడవైన ముక్కు, 20 సెం.మీ. తగ్గించిన పైకప్పుతో పాటు, మొత్తం బరువును 50 టన్నులు తగ్గించడం ద్వారా గాలి నిరోధాన్ని 22 శాతం మేర తగ్గించారు. ఈ రైలు కేవలం 4 నిమిషాల 40 సెకన్లలోనే సున్నా నుంచి గంటకు 350 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఇటీవల నిర్వహించిన ఒక ప్రదర్శనలో రెండు సీఆర్ 450 రైళ్లు ఎదురెదురుగా వెళ్తూ, సంయుక్తంగా గంటకు 896 కి.మీ. వేగాన్ని నమోదు చేశాయి. ప్రస్తుతం ఈ హైస్పీడ్ రైలు 6,00,000 కిలోమీటర్ల సుదీర్ఘ పరీక్షలను పూర్తి చేయనుంది. నూతన సాంకేతికతతో కూడిన ఈ రైలు పర్యావరణహితంగా, మరింత నిశ్శబ్దంగా, సురక్షితంగా ఉంటుందని చైనా రైల్వే వర్గాలు వెల్లడించాయి.