డీర్ అల్ బలా: సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని ఆర్మీ బేస్‌పై హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడిలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు. దాడిలో ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి మరణించినట్టు తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను ఐడీఎఫ్ ఖండించింది. బీరుట్లో గురువారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 22 మంది మరణించారు. దానికి ప్రతీకారంగానే ఈ డ్రోన్ దాడి జరిపినట్టు హెజ్బొల్లా ప్రకటించింది. అయితే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఈ డ్రోన్ ఎలా తప్పించుకున్నదో దర్యాప్తు చేస్తున్నామని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు.
హెజ్బొల్లా ప్రయోగించిన డ్రోన్ మిర్సాద్-1 రకానికి చెందినదిగా భావిస్తున్నారు. గంటకు 370 కిలోమీటర్ల వేగంతో 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది చేధించగలదు. భారీ సంఖ్యలో రాకెట్లతో కలిపి హెజ్బొల్లా ఈ డ్రోన్లను ప్రయోగించడంతో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వీటిని అడ్డుకోలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో సుమారు 20 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్ చేతికి థాడ్
ఇజ్రాయెల్‌కు అమెరికా అధునాతన యాంటీ మిస్సైల్ సిస్టమ్ ‘థాడ్’ను అందజేయనుంది. అమెరికా వద్దనున్న అధునాతన మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్‌లో థాడ్ ఒకటి. బాలిస్టిక్ మిస్సైల్స్‌ను అడ్డుకునే సామర్థ్యం దీనికి ఉన్నది.