బీజింగ్: హెర్డ్ ఇమ్యూనిటీ గురించి చైనా శాస్త్రవేత్త, పల్మనాలజీ నిపుణుడు జాంగ్ నాన్షాన్ కీలక విషయాన్ని తెలిపారు. డ్రాగన్ దేశం చైనాలో.. వచ్చే ఏడాది తొలి అర్థభాగంలో కరోనా వైరస్ పట్ల హెర్డ్ ఇమ్యూనిటీ ఏర్పాడే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా ఆ దేశ మీడియాతో ఆయన మాట్లాడారు. మనుషుల్లో సహజంగా వ్యాధి పట్ల రోగ నిరోధక శక్తి పెరగడమే హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. చైనాలో కరోనా వైరస్ నియంత్రణకు, వ్యాధి తీవ్రత అంశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను జాంగ్ నాన్షాన్ సూచించారు. శ్వాసకోస వ్యాధుల నిపుణుడైన నాన్షాన్కు, ఆయన బృందానికి.. చైనా ప్రభుత్వం తాజాగా అవార్డును కూడా ప్రకటించింది. అయితే అక్కడక్కడ కరోనా వ్యాపిస్తున్నదని, ఆ వ్యాధిని నెల రోజుల్లోనే సమర్థవంతంగా అరికట్టవచ్చు అని ఆయన అన్నారు. జీరో ట్రాన్స్మిషన్ పాలసీ అత్యంత కష్టమని ఆయన తెలిపారు.
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ చైనా నుంచి వివిధ దేశాలకు పాకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగానే సాగుతున్నది. కానీ హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే ఇంకా కోట్లాది మందికి వ్యాక్సిన్లు అందాల్సి ఉన్నది. వృద్ధ జనాభాకు వ్యాక్సిన్లను అత్యంత వేగంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నాన్షాన్ సూచించారు. కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. ఆ వైరస్ను వీలైనంత త్వరగా నియంత్రించాలన్నారు. కొన్ని దేశాలు సరిహద్దుల్ని తెరవడం వల్ల కూడా మళ్లీ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఆయన చెప్పారు. చైనాలో ఈ ఏడాది పూర్తయ్యే లోగా 80 శాతం మందికి వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు నాన్షాన్ వెల్లడించారు.