సిడ్నీ : టైప్ 2 మధుమేహం వల్ల గుండె నిర్మాణం మారుతుందని సిడ్నీ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. మధుమేహ రోగులకు గుండె విఫలమయ్యే ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. సిడ్నీలో గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న రోగుల నుంచి సేకరించిన గుండె కణజాలాన్ని ఈ పరిశోధకులు విశ్లేషించారు. గుండె కణాల్లో ప్రొటీన్లు, జన్యువులు వంటి అణువుల స్థాయిలో మార్పులు రావడానికి; కండరాల నిర్మాణంలో మార్పులకు మధుమేహం కారణమవుతుందని గుర్తించారు.
గుండె విఫలమవడానికి అత్యంత సాధారణ కారణమైన ఇషెమిక్ కార్డియోమయోపతీతో బాధపడే రోగుల్లో ఈ పరిస్థితి కనిపిస్తుందని గుర్తించారు. డాక్టర్ బెంజమిన్ హంటర్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధన పత్రాన్ని ‘ఈఎంబీఓ మాలెక్యులార్ మెడిసిన్’లో ప్రచురించారు.
హంటర్ మాట్లాడుతూ, గుండె జబ్బు, టైప్ 2 మధుమేహం మధ్య సంబంధం ఉన్నట్లు తాము చాలా కాలం నుంచి గమనిస్తున్నామన్నారు. మధుమేహం, ఇషెమిక్ హార్ట్ డిసీజ్లపై ఉమ్మడిగా జరిగిన మొదటి పరిశోధన ఇదేనని తెలిపారు. ఈ రెండు అనారోగ్యాలు ఉన్న వారిలో ప్రత్యేకమైన మాలెక్యులార్ ప్రొఫైల్ను గుర్తించినట్లు చెప్పారు. మధుమేహం వల్ల గుండె శక్తిని ఉత్పత్తి చేసే పద్ధతి ఎలా మారుతుందో, ఒత్తిడిలో గుండె నిర్మాణం ఎలా ఉంటుందో, రక్తాన్ని బయటకు పంపించడానికి గుండె ఏ విధంగా సంకోచిస్తుందో తమ అధ్యయనంలో వెల్లడైందని చెప్పారు.