న్యూఢిల్లీ: హమాస్(Hamas) సాయుధులు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇజ్రాయిల్ ప్రజల్ని బంధీ చేసిన ఆ వ్యక్తులు.. వారి చెరలో ఉన్న చిన్నారుల వీడియోను ప్రజెంట్ చేశారు. టెలిగ్రాం యాప్‌లో ఆ వీడియోను పోస్టు చేశారు. తమ వద్ద ఉన్న పిల్లల్ని బాగానే చూసుకుంటున్నామన్న సందేశాన్ని ఇచ్చేందుకు గాజా స్ట్రిప్‌లో ఉన్న సాయుధులు ఈ వీడియోను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.
ఓ చిన్నారిని తోపుడు బండిలో ఉంచి ఆడిస్తున్నారు. మరో చిన్నారిని చేతుల్లో ఎత్తుకుని తిప్పుతున్నారు. హమాస్ ఉగ్రవాదులు తమ చేతుల్లో ఏకే రైఫిళ్లను పట్టుకునే.. పిల్లల్ని ఆడిస్తున్న వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. మిలిటరీ దుస్తులతో ఏకే సిరీస్ రైఫిల్‌తో ఉన్న ఓ వ్యక్తి తన భుజాలపై ఓ చిన్నారిని ఎత్తుకున్నాడు.
ఇక తోపుడు బండిలో ఏడుస్తున్న మరో చిన్నారిని బుజ్జగించేందుకు ఓ సాయుధుడు ప్రయత్నించాడు. పిల్లలతోటి బిస్మిల్లా అనిపిస్తూ వాళ్లకు నీళ్లు తాగిస్తున్నారు. మరో వైపు ఇజ్రాయిల్ మాత్రం గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. గాజా నుంచి హమాస్‌ను తరిమేందుకు పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగింది.