న్యూయార్క్, డిసెంబర్ 11: పరిసర ప్రాంతాల్లో పచ్చదనంతో మానసిక ఉల్లాసం, రోగనిరోధక శక్తి మెరుగుపడటం, గుండె జబ్బులు దూరమవుతాయన్న సంగతి ఇప్పటికే పలు పరిశోధనల ద్వారా వెల్లడైంది. అయితే, మొక్కల మధ్య జీవనం సాగించే వారి వయసులోనూ ప్రత్యేక మార్పులను గుర్తించినట్టు నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. చెట్ల మధ్య జీవనం సాగించే వారికి స్వచ్ఛమైన ఆక్సిజన్ తగినంతగా అందుబాటులో ఉంటుందని, దీంతో కణాల్లో జీవక్రియ మెరుగ్గా ఉండి వాటి జీవితకాలం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఫలితంగా ఏండ్లు గడిచినప్పటికీ వారిలో వయసు మాత్రం పెరిగినట్టు కనిపించదని తెలిపారు. 7,827 మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్టు వివరించారు.