లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
కాలగణనలో కీలక మార్పునకు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, కాలమాన నిపుణులు నాందిపలికారు. దశాబ్దాలుగా అమల్లో ఉన్న లీప్ సెకండ్ విధానానికి ముగింపు పలికి, దాని స్థానంలో లీప్ అవర్ విధానాన్ని తీసుకురావాలని ఈ నెల 15న ఫ్రాన్స్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో నిర్ణయించారు.
- అణు గడియారాలు, భూ భ్రమణం మధ్య సమన్వయమే లక్ష్యం
న్యూయార్క్ : కాలగణనలో కీలక మార్పునకు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, కాలమాన నిపుణులు నాందిపలికారు. దశాబ్దాలుగా అమల్లో ఉన్న లీప్ సెకండ్ విధానానికి ముగింపు పలికి, దాని స్థానంలో లీప్ అవర్ విధానాన్ని తీసుకురావాలని ఈ నెల 15న ఫ్రాన్స్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో నిర్ణయించారు. కచ్చితమైన కాలమానాన్ని నిర్వహించడంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను తగ్గిస్తూనే, భూ భ్రమణానికి ప్రపంచ కాలమానాన్ని అనుసంధానంగా ఉంచడం ఈ మార్పు లక్ష్యం.
లీప్ సెకండ్ అంటే ఏమిటి?
భూమి తన చుట్టూ ఒకసారి తిరగడానికి సుమారు 24 గంటల సయమం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ సమయాన్ని నిర్ణయించడానికి ఇదే ప్రాతిపదిక. అయితే భూభ్రమణ వేగం ఎప్పుడూ ఒకేలా ఉండదు. దానిలో స్వల్ప హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. దీర్ఘకాలంలో భూభ్రమణ వేగం కూడా క్రమంగా తగ్గుతున్నది. ఈ వ్యత్యాసాన్ని సరిచేసి, గడియారాల సమయాన్ని, భూభ్రమణానికి దగ్గరగా ఉంచేందుకు అవసరమైనప్పుడు ఒక సెకనును అదనంగా జోడిస్తారు. దీన్నే లీప్ సెకండ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక సమయాన్ని నిర్ణయించేందుకు కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్‌ని ఉపయోగిస్తున్నారు. అత్యంత కచ్చితమైన అణు గడియారాల ఆధారంగా ఈ కాలమానాన్ని లెక్కిస్తారు. అణువులలో జరిగే నిర్దిష్ట కంపనాలను కొలవడం ద్వారా ఈ గడియారాలు సమయాన్ని కచ్చితంగా నిర్ధారిస్త్తాయి. అయితే, అణు గడియారాల సమయం, భూభ్రమణం ఆధారంగా లెక్కించే సమయం మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. ఈ రెండింటి మధ్య సమన్వయాన్ని కొనసాగించేందుకు లీప్ సెకండ్‌ను ప్రవేశపెట్టారు. 1972 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 27 లీప్ సెకన్లు చేర్చారు. చివరిసారిగా 2016లో అదనపు సెకనును జోడించారు.
సాంకేతిక రంగానికి ఎందుకు సమస్యగా మారింది?
లీప్ సెకన్ వల్ల గడియారాల సమయాన్ని భూభ్రమణంతో సమన్వయం చేయగలిగినప్పటికీ, కంప్యూటర్లు, ఆర్థిక లావాదేవీల వ్యవస్థలు, విమాన టికెట్ బుకింగ్ వంటి సేవలకు సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. 2012లో లీప్ సెకండ్‌ను చేర్చిన సమయంలో లింక్డ్ఇన్, రెడిట్ సేవల్లో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఆస్ట్రేలియాకు చెందిన విమానయాన సంస్థ క్వాంటాస్ టికెట్ బుకింగ్ వ్యవస్థ కూడా దెబ్బతిన్నట్టు నివేదికలు పేర్కొన్నాయి. 2022 జూలైలో మెటాసంస్థ ఇంజినీర్లు లీప్ సెకండ్ వల్ల సర్వర్లు, హార్డ్‌వేర్ మౌలిక సదుపాయాలు నిర్వహించే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇటీవలి దశాబ్దంలో భూభ్రమణ వేగం పెరిగిన సందర్భాలు కూడా ఈ చర్చకు ప్రాధాన్యం తెచ్చాయి. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ మార్పు కొనసాగితే భవిష్యత్తులో తొలిసారిగా ఒక సెకనును తీసివేసే నెగటివ్ లీప్ సెకండ్‌ను అమలుచేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
ఇకపై ఏం మారనుంది?
లీప్ సెకండ్‌ను సాధారణంగా డిసెంబర్ లేదా జూన్ నెల చివరి నిమిషంలో, అర్ధరాత్రికి ముందు చేర్చేవారు. అరుదైన సందర్భాల్లో మార్చి లేదా సెప్టెంబర్‌లోనూ సర్దుబాటు జరిగేది. లీప్ సెకండ్ అవసరమా కాదా అన్నది అంతర్జాతీయ భూభ్రమణ, సూచన వ్యవస్థల సేవ(ఐఈఆర్‌ఎస్)కు చెందిన ఎర్త్ ఓరియెంటేషన్ సెంటర్ సుమారు ఆరు నెలలు ముందుగా నిర్ణయించేది. కొత్త విధానంలో లీప్ సెకండ్ స్థానంలో లీప్ అవర్‌ను ప్రవేశపెట్టాలని ఈ కథనం పేర్కొంటున్నది. అయితే లీప్ అవర్‌ను ఎప్పుడు, ఎలా అమలు చేస్తారు, దాని సాంకేతిక విధానం ఏమిటి వంటి వివరాలు స్పష్టంగా వెల్లడి కావాల్సి ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ సేవలు, ఆర్థిక మార్కెట్, సమాచార వ్యవస్థలు కచ్చితమైన సమయంపై ఆధారపడుతున్న నేపథ్యంలో.. కాలమానంలో ఈ మార్పు భవిష్యత్తులో కీలక ప్రభావం చూపే అవకాశం ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

