Germany Knife attack : జర్మనీలోని సోలింజెన్ నగరంలో ఓ దుండగుడు కత్తితో దాడిచేసి ముగ్గురిని హతమార్చాడు. ఈ ఘటన వెనుక ఐసిస్ (ISIS) హస్తం ఉన్నట్లు తేలింది. హత్యలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి నిందితుడు రక్తపు మరకలు ఉన్న దుస్తులతో పోలీసుల వద్దకు వచ్చి మీరు వెతుకుతున్న వ్యక్తిని తానేనని చెప్పి లొంగిపోయాడు.
ఈ విషయాన్ని నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్ర అంతర్గత మంత్రి హెర్బర్ట్ రీల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కేసులో దర్యాప్తు ప్రారంభించామని, తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. నిందితుడు అమర్ ఒదేహ్ (36) 2022లో సిరియా నుంచి జర్మనీ వచ్చి బీలెఫెల్డ్లో నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా పాలస్తీనాలో ముస్లింలపై దాడులకు ప్రతీకారంగా తాము ఈ చర్యకు పాల్పడినట్లు ఐసిస్ ప్రకటించింది.
సోలింజెన్ నగర 650వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ‘ఫెస్టివల్ ఆఫ్ డైవర్సిటీ’ వేడుకల్లో రాత్రి 9.30 గంటల సమయంలో ఓ వ్యక్తి కొందరిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ వేడుకలు మూడు రోజులు జరగాల్సి ఉండగా.. మొదటి రోజే అనుకోని ఘటన జరగడంతో రద్దు చేశారు.