గాజా: హమాస్ పేరుతో ఇజ్రాయెల్ (Israel) రక్తపుటేరులు పారిస్తున్నది. గాజాపై (Gaza) భీకర దాడులకు పాల్పడుతూ పాలస్తీనియన్లను (Palestinians) పొట్టన పెట్టుకుంటున్నది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తున్నది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన సైనికదాడిలో తన పది మంది సంతానంలో తొమ్మిది మందిని కోల్పోయిన ఓ వైద్యుడు (Gaza Doctor) ప్రస్తుతం దవాఖానాలోని ఇంటెన్సివ్ కేర్ (ICU) చికిత్స పొందుతూ, చావుబతుకుల మధ్య ఉన్నాడు.
శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం ఖాన్ యూనిస్‌పై (Khan Younis) వైమానిక దాడి జరిపింది. గాజాకు చెందిన హమ్ది అల్-నజ్జర్ (Hamdi Al-Najjar) అనే డాక్టర్ తన 10 మంది పిల్లలతో పాటు ఇంట్లో ఉన్నప్పుడు ఈ దాడి జరగడంతో.. వారిలో తొమ్మిదిమంది చిన్నారులు మృతిచెందారు. డాక్టర్ నజ్జర్‌తోపాటు ఒక చిన్నారి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే నజ్జర్ తీవ్రంగా గాయపడటంతో ప్రస్తుతం దక్షిణ గాజాలోని సమీపంలోని నాజర్ దవాఖానలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన కడుపు, ఛాతీలో రక్త స్రావం అవుతున్నదని, దానిని నియంత్రించేందుకు రెండు సార్లు ఆపరేషన్లు జరిగాయని అబ్దుల్ అజీజ్ అల్-ఫర్రా అనే డాక్టర్ వెల్లడించారు. అతని తలకు కూడా తీవ్రగాయం అయిందని, ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిపారు.
కాగా, నజ్జర్ భార్య ఆలా (Doctor Alaa) కూడా వైద్యురాలు. అయితే దాడి సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో బతికిపోయారు. గత 20 నెలలుగా హమాస్, ఇజ్రాయెల్ పోరులో గాయపడిన పాలస్తీనియన్లకు తన భర్తతోపాటు ఆమె వైద్య సేవలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆమె ఇంటికి చేరుకుని విగత జీవులుగా పడివున్న తన పిల్లలను చూసి షాకయ్యారని నజ్జర్ సోదరి తహని యాహ్యా తెలిపారు. కాగా, వారి పది మంది సంతానంలో ఓ బాలుడు మాత్రమే బతికారని, అతనికి కూడా తీవ్ర గాయాలైనప్పటికీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. మృతిచెందినవారంతా ఒకటి నుంచి 12 ఏండ్ల వయస్సు లోపువారేనని పేర్కొన్నారు.
అయితే శుక్రవారం ఖాన్ యూనిస్‌పై వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. తమ ఆపరేషన్ ప్రారంభించే ముందు సైన్యం ఆ ప్రాంతం నుంచి పౌరులను తరలించినట్లు పేర్కొంది. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో యుద్ధం మొదలయ్యింది. ఇప్పటివరకు ఈ పోరులో 53 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. వారిలో 16,500 మందికిపైగా చిన్నారులే ఉన్నారు.
హమాస్‌ను పూర్తిగా నిరాయుధీకరణ చేయడమే కాక, వారి వద్ద బందీలుగా ఉన్న 53 మంది తమ దేశ పౌరులను విడిపించేంత వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రతిజ్ఞ బూనింది. అంతేకాక, గత రెండున్నర నెలల నుంచి గాజాకు ఆహారం, మందులు, చమురు సరఫరాను నిలిపివేసింది. దీంతో అక్కడి పౌరులు ఆకలితో అల్లాడుతున్నారు. ఐరాస, ఇతర అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి మేరకు మానవతా సాయాన్ని పాక్షికంగా ఇజ్రాయెల్ పునరుద్ధరించింది.