పారిస్, నవంబర్ 15:యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలపై సిరియా అధ్యక్షుడు బషర్ అషద్, అతని సోదరుడు, మరో ఇద్దరు ఆర్మీ జనరల్స్‌పై ఫ్రెంచ్ న్యాయస్థానం బుధవారం అంతర్జాతీయ అరెస్ట్ వారంట్‌ను జారీ చేసింది. దౌమా, తూర్పు గౌతా ప్రాంతాల్లో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న డమస్కస్ సబర్బన్ ప్రాంతాలపై 2013 ఆగస్టులో రసాయన ఆయుధాలతో జరిపిన దాడుల్లో వెయ్యి మంది మృతి చెందగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ దాడిలో మృతి చెందిన కుటుంబ సభ్యులు, బాధితులతో పాటు సిరియన్ సెంటర్ ఫర్ మీడియా అండ్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ (ఎస్సీఎం) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫ్రాన్స్‌లోని సారస్వత అధికార పరిధిలో ప్యారిస్ జ్యుడీషియల్ కోర్టు 2021లో విచారణ ప్రారంభించింది. సిరియా అధ్యక్షుడు అషద్తో పాటు ఆయన సోదరుడు మహెర్ అషద్, మరో ఇద్దరు జనరల్స్ ఈ దాడులకు బాధ్యులని ప్యారిస్ జ్యుడీషియల్ కోర్టు నిర్ధారించింది. ఈ చర్య ద్వారా వారు యుద్ధ నేరాలకు పాల్పడ్డారని పేర్కొంటూ అంతర్జాతీయ అరెస్ట్ వారంట్‌ను జారీ చేసింది.