న్యూయార్క్, సెప్టెంబర్ 3: పర్యావరణహిత బ్యాటరీలను తయారుచేసేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. లిథియం అయాన్ బ్యాటరీల్లో వినియోగించే రసాయనాలు నశించేందుకు వందలు, వేల ఏండ్ల సమయం పడుతుంది. పైగా వాటి వల్ల వాహనాలు దగ్ధమవుతున్నాయి. అందుకే అమెరికాలోని కొందరు శాస్త్రవేత్తలు కొత్త ఆలోచన చేశారు.
తాజాగా ఎండ్రికాయలు, లాబ్స్టర్ల చిప్పల నుంచి తయారు చేసిన ఓ పదార్థాన్ని బ్యాటరీల తయారీకి వినియోగించొచ్చని గుర్తించారు. ఖైటిన్ అనే పదార్థంతో వీటి చిప్పలు తయారవుతాయి. చాలా దృఢంగా ఉండే ఈ పదార్థాన్ని కొన్ని ద్రవాలతో (ఎసిటిక్ యాసిడ్) చర్య జరిపించి జెల్ వంటి పదార్థాన్ని తయారు చేసి.. బ్యాటరీల్లో వాడే ఎలక్ట్రోలైట్లుగా వినియోగించొచ్చని చెబుతున్నారు.