Sunita Williams | వ్యోమగాములు (astronauts) సునీతా విలియమ్స్ (Sunita Williams), బుష్ విల్మోర్ (Butch Wilmore) వారం రోజుల మిషన్ కోసం వెళ్లి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్య కారణంగా 8 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వారిని భూమికి తీసుకొచ్చేందుకు ట్రంప్ (Donald Trump) సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. మరో 20 రోజుల్లో వారు భూమికి చేరే అవకాశం ఉంది. అయితే, ‘రాజకీయ కారణాల’ (Political Reasons) వల్లే వారు ఇన్ని రోజులూ అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందని టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) తెలిపారు. గత బైడెన్ సర్కారే వారిని అక్కడ వదిలేసిందని ఆరోపించారు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మస్క్.. వ్యోమగాముల గురించి మాట్లాడారు. ‘రాజకీయ కారణాల వల్లే ఇద్దరు వ్యోమగాములూ ఐఎస్ఎస్లో ఉండిపోవాల్సి వచ్చింది. గత బైడెన్ (Joe Biden) సర్కారే వారిని అక్కడ వదిలేసిందని నేను భావిస్తున్నాను. ఇది మంచిది కాదు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు వారిని భూమికి తీసుకొచ్చే ప్రయత్నాలు వేగవంతం చేశాం. ఇప్పటికే చాలా మందిని అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి భూమికి చేర్చాం. అలా చేసిన అన్ని ప్రయత్నాలూ ఫలించాయి. ఇప్పుడు కూడా విజయం సాధిస్తాం’ అని మస్క్ తెలిపారు.
మార్చి 19న భూమిపైకి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గత 8 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ మార్చి 19న తిరిగి భూమిపైకి రానున్నారు. సీఎన్ఎన్తో మాట్లాడిన సునీతా విలియమ్స్, బుట్చ్ విల్మోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆరు నెలల సుదీర్ఘ కాల మిషన్ కోసం మార్చి 12న ఐఎస్ఎస్కు వెళ్లనున్న క్రూ-10 మిషన్‌లోని వ్యోమగాములకు సునీతా, విల్మోర్ తమ బాధ్యతలను అప్పగిస్తారు. ఆ తర్వాత క్రూ-10 వ్యోమనౌకలో సునీతా, విల్మోర్ భూమికి తిరిగి రానున్నారు. వారిద్దరినీ వీలైనంత త్వరగా భూమి పైకి తీసుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన నేపథ్యంలో ప్రాక్టికల్‌గా వీలైనంత త్వరగా వారిని భూమి మీదకు తీసుకొస్తామని నాసా (NASA) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
వారం రోజుల మిషన్ కోసం వెళ్లి..
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ గతేడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైన్ (Boeing Starliner) స్పేస్‌షిప్‌లో ఐఎస్ఎస్కి వెళ్లారు. వారం రోజుల మిషన్ కోసం వెళ్లిన వ్యోమగాములు స్టార్‌లైర్‌లో సాంకేతిక లోపం కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. జూన్ 6న ఇద్దరూ వ్యోమగాములు ఐఎస్ఎస్లోకి వెళ్లగా.. అదే నెల 14న తిరిగి భూమిపైకి రావాలి. కానీ, స్టార్ లైనర్‌లో హీలియం లీకేజీ నేపథ్యంలో ప్రయాణం వాయిదా పడింది. ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేసింది. ఇందు(NASA) కోసం స్పేస్ ఎక్స్ (SpaceX)తో కలిసి పనిచేస్తోంది. ఫిబ్రవరి 2025లో తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వాళ్లు మరోనెల రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది.
Also Read..
“Sunita Williams | గురుత్వాకర్షణతో పోరు తప్పదు! భూమి మీదకు తిరిగి వచ్చాక వ్యోమగాములకు సవాల్ ఇదే”
“Donald Trump | సునీతా విలియమ్స్‌ను భూమికి తీసుకొచ్చేందుకు మస్క్ సాయం కోరిన డొనాల్డ్ ట్రంప్”